పవన్ కు నైతిక విలువలు లేవు
విజయవాడ నవంబర్ 15 :
వైకాపా గురించి మాట్లాడే నైతిక విలువలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేవని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. తమపై పవన్ కల్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని, 'విజయసాయిరెడ్డి సూట్ కేసు కంపెనీలు' అంటూ పవన్ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. 'తాట తీసి మూలన కూర్చోబెడతాను. నా ముందు తల ఎగరేయొద్దు' అంటూ పవన్ వ్యాఖ్యానించారని అన్నారు. 'పవన్ మాత్రం వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు.. ఇతరులు చేయకూడదా?' అని అంబటి ప్రశ్నించారు.
సీఎం జగన్ ను విమర్శిస్తోన్న ఆయనకు ఎక్కడి నుంచి ప్యాకేజీలు వస్తున్నాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరత కృత్రిమంగా సృష్టించబడలేదని అన్నారు. కార్మికులను కావాలనే ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని, జగన్ కి డబ్బు పిచ్చని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతోన్న జగన్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు. దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అసత్యాలు పలకడం సరికాదని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు హయాంలో చనిపోయిన వారికి ఏం చేశారు? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాజకీయాల్లో కొందరు మత ప్రస్తావన తీసుకొస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో మత ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? అని ప్రశ్నించారు. పాదయాత్ర ముందు, తర్వాత కూడా శ్రీవారిని జగన్ దర్శించుకున్నారని అన్నారు. ఆయన హిందూ వ్యతిరేకి అంటూ కొందరు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. చౌకబారు ఎత్తుగడలు వేసి, తమ ఉనికిని కాపాడుకోవాలని చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే జగన్ పై పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో డౌన్ డౌన్ అంటే కేసులు పెట్టారని, ఇప్పుడా పరిస్థితులు రాష్ట్రంలో లేవని అంబటి రాంబాబు అన్నారు.