శబరిమల వచ్చే మహిళలకు భద్రత కల్పించలేము: కేరళ ప్రభుత్వం
తిరువనంతపురం నవంబర్ 15
:శబరిమల ఆలయానికి రావాలనుకుంటున్న మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించే ఉద్దేశ్యం కేరళ ప్రభుత్వానికి లేదని కేరళ దేవదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్ర స్పష్టం చేశారు. భక్తుల దర్శనార్థం రేపటి నుంచి శబరిమల ఆలయాన్ని తెరువనున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు గతేడాది అమిత ఉత్సాహం ప్రదర్శించిన కేరళ ప్రభుత్వం... 2019 లోక్‌సభ ఎన్నికల్లో తగిలిన షాక్‌తో ఈ సారి ఆచితూచి అడుగులు వేస్తోంది. 2018లో శబరిమల తీర్పు తర్వాత వెల్లువెత్తిన నిరసనల కారణంగా మొత్తం 50 వేల మందికిపై కేరళ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడడంతో... వామపక్ష కూటమికి మొత్తం 20 స్థానాల్లో 19 చోట్ల చావుదెబ్బ తగిలింది. తాజాగా శబరిమల తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయడం.. గత తీర్పుపై ఎలాంటి స్టే విధించకపోవడంతో మళ్లీ శబరిమలలో మహిళల ప్రవేశానికి ద్వారం తెరిచినట్టైంది. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం శబరిమల వచ్చే మహిళలకు భద్రత నిరాకరించడం గమనార్హం. కాగా భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ మాత్రం తాను మండల పూజ ప్రారంభమయ్యే తొలిరోజే శబరిమలను సందర్శిస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘‘ఎవరైనా ఆలయానికి వెళ్లాలనుకుంటే కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకోవచ్చు...’’ అని పేర్కొన్నారు.