YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పడకేసిన విద్య (కర్నూలు)

పడకేసిన విద్య (కర్నూలు)

పడకేసిన విద్య (కర్నూలు)
కర్నూలు, : పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణ పడకేసింది. జిల్లాలోని మూడు డివిజన్లు, 14 మండలాల్లో ఇన్‌ఛార్జుల పాలనే సాగుతోంది. ఒక్కొక్కరికి రెండు, మూడేసి బాధ్యతలు అప్పగించడంతో వారెక్కడ విధులు నిర్వర్తించాలో తెలియక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు ఈ ప్రభావం విద్యార్థులపైనా పడుతోంది. నాణ్యమైన బోధన అందడం లేదు. పర్యవేక్షణ లేకపోవడం.. మౌలిక సదుపాయాలపై దృష్టి సారించలేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా ఎంతో ప్రాధాన్యమైన పోస్టుల భర్తీపై దృష్టి సారించేవారే కరవయ్యారు.  2019-20 విద్యా సంవత్సరానికి యుడైస్‌ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యంలో 2,427 ప్రాథమిక పాఠశాలల్లో 2,74,121 మంది విద్యార్థులు ఉన్నారు. 950 ప్రాథమికోన్నత విద్యాలయాల్లో 1,27,380 మంది, 1,015 ఉన్నత బడుల్లో 2,98,930 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 38,868 మంది, ప్రైవేటు యాజమాన్యాల నుంచి 20,731 మంది పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు జిల్లా విద్యాశాఖకు సంబంధించి నాలుగు డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్‌కు ఒక ఉప విద్యాధికారి ఉండాలి. కర్నూలు డివిజన్‌ మినహాయించి నంద్యాల, డోన్‌, ఆదోని డివిజన్లకు డిప్యూటీ డీఈవో పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. జిల్లాలో 54 మండలాలు ఉండగా అందులో గడివేముల, జూపాడుబంగ్లా, కల్లూరు, కృష్ణగిరి, పత్తికొండ, తుగ్గలి, ఎమ్మిగనూరు, కౌతాళం, పెద్దకడబూరు, హొళగుంద, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజామల, శ్రీశైలం మండలాలకు ఎంఈవోలు లేకపోవడంతో పక్క మండలాల అధికారులకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. పాఠశాల విద్యాశాఖలో ఎక్కడ చూసినా ఇన్‌ఛార్జులే దర్శనమిస్తున్నారు. ఉప విద్యాధికారి స్థాయి నుంచి ఎంఈవో అధికారి పోస్టు వరకు సర్వం ఇన్‌ఛార్జుల పాలన కొనసాగుతోంది. ఫలితంగా పర్యవేక్షణ లోపించడంతో విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయి. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, పుస్తకాల పంపిణీ, యూనిఫాం అందజేయడం తదితర ప్రధాన పనులు ఉన్నాయి. ప్రధానంగా పదో తరగతిలో ఫలితాలను పెంచాలని కలెక్టర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇంతటీ కీలకమైన సమయంలో పర్యవేక్షణ అధికారుల స్థాయి పోస్టులన్నీ ఇన్‌ఛార్జులతోనే కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశం. విద్యార్థులకు నాణ్యమైన బోధన సైతం సక్రమంగా అందడం లేదన్న ఆరోణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తమ పనితీరులో సమర్థులైనప్పటికీ అధిక ఒత్తిడితో పర్యవేక్షణ చేయలేకపోతున్నారనే విమర్శలున్నాయి. అందుకు గత పది ఫలితాలే నిదర్శనమని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. మరోవైపు విద్యాశాఖ పరిస్థితిపై విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు.
ప్రాథమిక విద్యాశాఖలో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడుతోంది. సింహభాగం డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు ఇన్‌ఛార్జులే కావడం, ఒక్కొక్కరికి రెండు.. ఆపై బాధ్యతలను అప్పగించడంతో వారెక్కడ విధులు నిర్వర్తించాలో తెలియడం లేదు. దీంతో డివిజన్‌ స్థాయిలో అధికారులు పర్యవేక్షణను గాలికొదిలేశారు. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఏటా పదో తరగతి ఫలితాల్లో జిల్లా గ్రాఫ్‌ పడిపోతుండటం ఆందోళన కలిగించే విషయమే. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో విద్యార్థుల ప్రవేశాలు ఇక్కడే అత్యధికంగా నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఒక్కరే రెగ్యులర్‌ డీవైఈవో ఉన్నారు. మరో మూడు డీవైఈవో పోస్టుల్లో ఇన్‌ఛార్జి పాలనే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇకనైనా పోస్టుల భర్తీపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Related Posts