ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి 30న ప్రత్యేక మేళా
డిసెంబర్ 31 లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ
హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్‌లో భూ క్రమబద్దీకరణ పథకం (ఎల్.ఆర్.ఎస్)దరఖాస్తుల పరిష్కారానికి ఈ నెల 30వ తేదీన అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక మేళా నిర్వహించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. 2016 డిసెంబర్ 31వ తేదినాటికి ముందు స్వీకరించిన ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను మరోసారి పరిశీలించి 2019 డిసెంబర్ 31వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ఉత్తర్వులను జారీచేసింది జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం 85,291 ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు అందగా 28,935లకు ఎల్.ఆర్.ఎస్ ప్రొసిడింగ్‌లు జారీచేసారు. వీటిలో 20,425 దరఖాస్తులను తిరస్కరించగా, మరో 25,726 దరఖాస్తులకు కావాల్సిన పత్రాలను జతపర్చాలని(షార్ట్ పాల్స్) సమాచారం అందించారు. అయితే ఈ షార్ట్ పాల్ ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుదారులు స్వయంగా సంబంధిత సర్కిల్ కార్యాలయాలకు వచ్చి ఆమోదం పొందేలా నవంబర్ 30వ తేదీన ప్రత్యేక మేళా లు నిర్వహిస్తున్నట్టు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ప్రకటించారు. గతంలో షార్ట్‌పాల్ సర్టిఫికేట్లను జతపర్చాల్సిందిగా కోరగా 2,516 మంది షార్ట్ పాల్‌లను జతపర్చి తిరిగి దరఖాస్తులు అందించినందున వీటిని కూడా పరిశీలించనున్నట్టు పేర్కొన్నారు. కాగా జిహెచ్ఎంసి కి సంబంధించి హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులన్నింటికి మరో వారం రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. హైకోర్టులో టౌన్ ప్లానింగ్ విభాగం పై ఉన్న కోర్టు కేసులపై సమీక్షిస్తూ ప్రజావాణిలో అందే ఫిర్యాదుల్లో అధిక శాతం టౌన్ ప్లానింగ్ విభాగానివే ఉంటున్నందున ఈ ఫిర్యాదులపై వెంటనే తగు చర్యలు చేపట్టి లిఖితపూర్వకంగా ఫిర్యాదుదారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించి కాంటెంప్ట్ కేసులన్నింటికి వారం రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పలు కేసుల విషయంలో వ్యక్తిగత హాజరు కావాలని వచ్చిన కోర్టు ఆదేశాలకు సంబంధించిన కేసులపై తగు చర్యలను వెంటనే తీసుకొని నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు. అన్ని రిట్‌పిటీషన్లకు సంబంధించి కౌంటర్లను 15రోజుల్లోగా దాఖలు చేసి ఈ పిటీషన్లకు సంబంధించి తగు చర్యలను చేపట్టాలని స్పష్టం చేశారు. టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించిన కేసులు హైకోర్టులో దాఖలు కాగానే వాటికి కౌంటర్లు వేయడం, ఆయా కేసులపై తగు చర్యలను చేపట్టని టౌన్‌ప్లానింగ్ అధికారులపై నిబంధనలను అనుసరించి క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్టు హెచ్చరించారు. ఏదైన ఒక కేసు గురించి స్పష్టమైన ఆదేశాలను కోర్టుకు జారీచేస్తే వాటిని కచ్చితంగా అమలుచేసే బాధ్యత టౌన్‌ప్లానింగ్ అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఏదైన కేసు విషయంలో తుది తీర్పును కోర్టు జారీచేస్తే వాటిని వెంటనే అమలు చేయాలని అన్నారు.