అందని ఉపకారం (మహబూబ్ నగర్)
మహబూబ్ నగర్, : ఉపకార వేతనాలు, బోధన రుసుములు రాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడిసిన్‌తోపాటు పలు కోర్సుల విద్యార్థులు, ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు బోధన రుసుములపైనే ఆధారపడ్డారు. విద్యా సంవత్సరం ముగిసే నాటికి కళాశాలలకు ఈ రుసుములు వస్తాయనే ఆశతో విద్యార్థుల వద్ద ఎలాంటి రుసుములు తీసుకోకుండా విద్యను అందిస్తున్నారు. తీరా విద్యా సంవత్సరం ముగిసిన తరవాత కూడా ఆ రుసుములు రాకపోవడంతో విద్యార్థులకు వారి ధ్రువపత్రాలు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు.. మరోవైపు ఉపకార వేతనాలదీ అదే పరిస్థితి. బోధన రుసుములు, ఉపకార వేతనాలు ప్రభుత్వం అరకొరగా విడుదల చేస్తుండటంతో సకాలంలో విద్యార్థులకు అందడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2018-19 ఏడాదికి 34,793 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు కాలేదు. వారికి రూ.42.62 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు 2018-19లో 85,532 మంది ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం అంతర్జాలంలో దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇప్పటి వరకు 60,829 మందికి మాత్రమే నిధులు విడుదలయ్యాయి. ఇంకా 34,703 మందికి రాలేదు. ఇందులో బీసీ సంక్షేమం నుంచి ఎక్కువ బకాయిలు పేరుకొనిపోయాయి.
విద్యార్థులు బోధన రుసుములు, ఉపకార వేతనాల కోసం అంతర్జాలంలో దరఖాస్తు చేసుకున్న తరవాత వాటికి సంబంధించిన వివరాలన్నీ కళాశాల ప్రిన్సిపల్ లాగిన్‌లోకి వెళతాయి. అక్కడ నుంచి ఆ కళాశాల ప్రిన్సిపల్ సంబంధిత సంక్షేమశాఖల సహాయ అధికారుల లాగిన్‌కు పంపుతారు. ఆ వివరాలను చూసి ఏఎస్‌డబ్ల్యూవోలు తమ లాగిన్ నుంచి జిల్లా అధికారి లాగిన్‌కు పంపుతారు. అక్కడ వాటికి ఆమోదం తెలిపి ఆయా శాఖల అధికారులు కలెక్టర్ ఆమోదంతో సంబంధిత శాఖల రాష్ట్ర సంచాలకులకు అంతర్జాలం ద్వారా వివరాలను పంపుతారు. అక్కడ నుంచి ప్రభుత్వానికి నివేదిక అందిన తరవాత నిధులు మంజూరవుతాయి. ఇలా ఉపకార వేతనాల ప్రక్రియ కొనసాగుతుంది. కాని ప్రధానంగా కళాశాలల ప్రిన్సిపల్స్ నుంచే దరఖాస్తులు సకాలంలో రావడం లేదు. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు అంతర్జాలంలో దరఖాస్తులు చేసిన వాటి వివరాలను, ధ్రువపత్రాలను ప్రిన్సిపల్‌కు అందించాలి. ఇందులో కొంత జాప్యం కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇప్పటికి 85,532 దరఖాస్తుల్లో 67,438 దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఇంకా 18,094 దరఖాస్తులకు కొన్ని రకాల సాంకేతిక కారణాల వల్ల మోక్షం కలగలేదు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్న వాటిలో 16,609 దరఖాస్తులకు ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. మొత్తంగా 34,703 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి నిధులు రూ.42.62కోట్లు విడుదల కావాల్సి ఉంది.