కష్టానికి ఫలితమేదీ..? (నల్గొండ)
నల్గొండ, : అరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాత నష్టపోతున్నాడు. మూడు నెలలపాటు కష్టించి దిగుబడి సాధించిన రైతన్నకు గిట్టుబాటు ధర అందడం లేదు. పాలకులు, అధికారులు పట్టించుకోక పోవడంతో దిగుబడులను వ్యాపారులకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. పంటలతోపాటు ఆశలను పెంచుకునే కర్షకులకి చివరికి కష్టనష్టాలే మిగులుతున్నాయి. సన్నరకం పండించిన అన్నదాతలకు గిట్టుబాటు ధర అందడం లేదు. గ్రామాల్లో ఏళ్ల నుంచి ఉంటున్న దళారులు సిండికేటుగా మారి ఉత్పత్తులను తక్కువ ధరలకే కొనుగోలు చేస్తూ దగా చేస్తున్నారు. అకాలంలో కురిసిన వర్షాలు చేతికొస్తున్న పంటను నేలపాలు చేశాయి. నేలరాలిన పంటకు దోమపోటుతో నష్టం వాటిల్లింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా తప్పనిసరిగా సాగునీరు వస్తుండటంతో రైతులంతా సన్నరకాల వైపే మొగ్గుచూపుతారు. ఎన్నెస్పీ కాల్వ పరిధిలోని రైతులంతా సన్న రకాలైన పూజలు, చింట్లు, ఆర్‌ఎన్‌ఆర్ రకాలు, జిలకర., సాంబ మసూర, బీపీటీలు సాగు చేస్తారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యానికి గిరాకీ ఉంది. అందులో మిర్యాలగూడ ప్రాంతంలో దేశంలోనే ఆధునికమైన రైస్ మిల్లులున్నాయి. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలకు బియ్యాన్ని సరఫరా చేస్తారు. అంతేకాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. దీంతో ఆయకట్టు ప్రాంతంలోనే రైతులే సాగు చేస్తుండటంతో.. వారి నుంచి నేరుగా దళారుల సాయంతో మిల్లర్లు ధ్యాన్యాన్ని సేకరిస్తున్నారు. మిల్లర్ల మాయజాలానికి.. దళారుల సిండికేట్ వ్యవహారం తోడు కావడంతో.. రైతులకు మద్దతు ధర దొరకడం లేదు. గత సీజనులో ఇక్కడ క్వింటా రూ.1,900 నుంచి రూ.2,200 వరకు పలికింది. ధాన్యాన్ని నేరుగా పొలం దగ్గర నుంచే వ్యాపారులు సేకరిస్తారు. ‘పచ్చి ధాన్యాన్ని తీసుకుంటున్నాం కనుక తేమ శాతం తగ్గుతుంది. మాకు నష్టం వస్తుందని చెబుతూ..’ బహిరంగ విపణి కంటే క్వింటాకు రెండు మూడు వందల తక్కువ ధర నిర్ణయిస్తారు. దళారులు సిండికేట్ కావడంతో.. ఒక వ్యాపారి ధర నిర్ణయిస్తే.. మరో వ్యాపారి ఆ ధాన్యం జోలికి వెళ్లరు. గత్యంతరం లేక వారు నిర్ణయించిన ధరలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులది. అలాగే తూకాలకు వినియోగించే.. కాంటాల్లో సైతం మోసాలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక సీజనులో క్వింటాకు రూ.200 నుంచి రూ.300 మేర ధర తగ్గితే.. రూ.కోట్లు రైతులకు నష్టం కలుగుతోందని.. రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మార్కెటింగ్ శాఖ అధికారులు.. మిల్లర్లకు, వ్యాపారులకు, దళారులకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వరి కోతలు ప్రారంభం కాగానే మార్కెట్ యార్డుల్లో వేలంపాటలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి. కొన్నేళ్ల నుంచి అధికారులు ఈ పనిని గాలికొదిలేశారు. రైతులు కూడా ధాన్యాన్ని మార్కెట్టు యార్డులకు తీసుకురాకుండా నేరుగా.. పొలం వద్దనే దళారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలకే మద్దతు ధర కల్పిస్తున్నారు. సన్నరకం ధాన్యాన్ని గ్రేడ్-2 రకంగా భావిస్తున్నారు. మార్కెట్టు యార్డుల్లో బహిరంగ వేలం నిర్వహిస్తే.. వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడి గిట్టుబాటు ధర లభించే అవకాశాలు ఉన్నాయి. ఆయకట్టు ప్రాంతంలోని 20పైగా మండలాల్లోని గ్రామాల్లో దళారులు బహిరంగంగానే కొనుగోళ్లు చేస్తున్నారు. నేరుగా పొలాల వద్దే కాంటాలు ఏర్పాటుచేసి తూకాలు వేస్తున్నారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించే వాతావరణ సూచనలను అనుసరిస్తూ వర్షసూచన ఉంటే.. కొనుగోళ్లను నిలిపేస్తారు. చినుకు పడిదంటే అడ్డగోలుగా ధర తగించి రైతులను నట్టేటా ముంచేందుకు ప్రయత్నం చేస్తారు. రెండు నెలల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అన్ని మండలాల్లో వరి నేలవాలింది. రెండు జిల్లాల పరిధిలో సుమారు 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నేలవాలిన వరి పంటకు దోమపోటు సోకడంతో.. మరింతగా పంట నష్టం జరిగింది. నేలవాలిన మొక్కలకు గాలి సోకకపోవడంతో దోమ పెరిగిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. సోకిన దోమ పొలమంతా వ్యాప్తి చెందడంతో పొట్టదశలో పంటకు అధికంగా జరిగే అవకాశముందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.