తుది మెరుగులు దిద్దుకుంటున్న వాజపేయి భారీ శిలా విగ్రహం
జైపూర్
బీజేపీ దిగ్గజం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి భారీ శిలా విగ్రహం తుది మెరుగులు దిద్దుకుంటున్నది. పాతిక అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహాన్ని రాజస్థాన్ లోని జైపూర్ లో తయారీ చేయిస్తున్నారు. కంచుతో పాటు ఇతర లోహాల మిశ్రమాన్ని ఈ విగ్రహం తయారీలో వినియోగిస్తున్నారు. ప్రముఖ శిల్ప కళాకారుడు రాజ్ కుమార్ పండిత్ దీన్ని రూపొందిస్తున్నారు. బీహార్ లోని నలందకు చెందిన రాజ్ కుమార్ రెండు దశాబ్ధాల క్రితం జైపూర్ కు వచ్చి స్థిరపడ్డారు. రాజ్ కుమార్ మాట్లాడుతూ... వాజపేయి విగ్రహం తయారీ అవకాశం తనకు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు. తనకెంతో నచ్చిన నేత ఆయనని, ఆయన ప్రసంగాలు వింటానని అన్నారు. వాజ్ పేయి నిత్యమూ ధరించే పంచెకట్టు, లాల్చీ, బూట్ల తో ఈ విగ్రహం నిండుగా ఉంటుందన్నారు. వాజపేయి చిత్రాలను ఎన్నింటినో పరిశీలించిన తరువాతే విగ్రహం ఆకారాన్ని రూపొందించామని ఆయన చెప్పారు. మరో నెలన్నరలో ఈ పనులు పూర్తి అవుతాయని, తరువాత ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు తరలిస్తామని రాజ్ కుమార్ తెలిపారు.