బుల్ పరుగు కొనసాగుతోంది. సూచీలు వెనుదిరిగి చూడట్లేదు.. పాత రికార్డులను బద్దలుకొడుతూ.. కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి. దేశీయ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లోనూ దూకుడు ప్రదర్శించని సూచీలు.. ఆల్‌టైం రికార్డుల్లో స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 10,900 మైలురాయికి చేరువైంది.
ఆసియా మార్కెట్ల ప్రభావం.. కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఈ ఉదయం దేశీయ సూచీలు ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. మదుపర్ల కొనుగోళ్ల అండతో అంతకంతకు ఎగబాకి.. కొత్త రికార్డులను సాధించాయి. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 251 పాయింట్లు లాభపడి 35,511 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయిని చేరుకుంది. నిఫ్టీ కూడా 78 పాయింట్ల లాభంతో 10,895 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 63.75గా కొనసాగుతోంది.
ఎన్‌ఎస్‌ఈలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, అదానీపోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు లాభపడగా.. అంబుజా సిమెంట్, ఆల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.