జనసేన డొక్క సీతమ్మ ఆహార శిబిరాలు
గుంటూరు, నవంబర్ 15,
జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలను ప్రారంభమయ్యాయి. శుక్రవారం అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మంగళగిరిలో శ్రీకారం చుట్టారు. పవన్ స్వయంగా భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు. జనసేన ఆధ్వర్యంలో ‘డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు’పేరిట రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తోంది. ఈ శిబిరాల ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఆహారం అందించనున్నారు. అసలు ఎవరీ డొక్కా సీతమ్మ.. జనసేన ఆమె పేరుపై ఎందుకు ఆహార శిబిరాలు ఏర్పాటు చేసిందనే అనుమానం రావొచ్చు. సీతమ్మ గొప్ప మానవతావాది.. పేదవారు ఎవరు ఏ వేళలో వచ్చి భోజనమని అడిగినా లేదు.. తర్వాత రా అనే మాట లేకుండా పట్టెడన్నం పెట్టి ఆకలి తీర్చేవారు. అందుకే ఆమె పేరును ఇప్పటికీ అందరూ తలచుకుంటుంటారు.డొక్కా సీతమ్మ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలుకా మండపేటలో 1841 అక్టోబరులో జన్మించారు. ఆమె తండ్రి అనుపిండి భవానీశంకరం, తల్లి నరసమ్మ. సీతమ్మ తండ్రి శంకరం గ్రామస్థులు 'బువ్వన్న' గారని ముద్దు పేరుతో పిలుస్తుండేవారు. ఆయన అందరికి చేతనైనంత సాయం చేస్తుండేవారు. అయితే సీతమ్మకు చిన్నతనం నుంచి తల్లిదండ్రులు కథలు, గాథలు, పాటలు, పద్యాలు నేర్పించారు. పాత రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశం లేకపోవడంతో.. ఆమె పెద్దబాలశిక్ష వరకు మాత్రమే పూర్తి చేశారు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో.. ఇంటి బాధ్యతలు ఆమెపై పడ్డాయి.ఇక గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉండే లంక గన్నవరంలో డొక్కా జోగన్న పంతులు అనే ధనవంతుడు ఉండేవారు. ఆయన పెద్ద రైతు, అందులోనూ ధనవంతుడు, వేదపండితుడు. ఓ రోజు జోగన్న పండిత సభకు వెళ్లి వస్తూ మండపేట వచ్చారు.. మిట్ట మధ్యాహ్నం బాగా ఆకలయ్యింది. అప్పుడే జోగన్నకు భవానీ శంకరం గుర్తుకొచ్చారట. నేరుగా ఆ ఇంటికి వెళ్లి.. అక్కడే భోజనం చేశారు. సీతమ్మ కూడా ఆదరాభిమానాలు చూపించడంతో.. ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నారట. తన మనసులో మాటను సీతమ్మ తండ్రికి చెప్పగానే ఒప్పుకోవడంతో వివాహం జరిగింది.సీతమ్మ అత్తింట్లో అడుగు పెట్టగానే ఇంటి పేరు కూడా మారిపోయింది. ఆ తర్వాత లంక గన్నవరం గోదావరి మార్గ మధ్యలో ఉండటంతో.. వచ్చే పోయే ప్రయాణికులు ఎక్కువగా ఉండేవారు. కొందరు ఆకలితో అలమంటించేవారట.. అప్పటి నుంచి సీతమ్మ-జోగన్న దంపతులు వారి ఆకలి తీర్చేవారు. ఎవరు ఏ సమయంలో వచ్చి భోజనం అడిగినా లేదనరు.. ఆదరించి అన్నం పెట్టేవారు. తర్వాత లంక గ్రామాల్లో తరచు వచ్చే అతివృష్టి, అనావృష్టిలతో ఇబ్బందులు పడే ఆ గ్రామాల పేదలను ఆదుకున్నారు.. వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టేవారు.ఓసారి ఆమె అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వెళుతుండగా.. గోదావరి వంతెన దగ్గర బోయీలు పల్లకి ఆపారు. పి.గన్నవరం వైపు వెళుతున్న ప్రయాణికుల్లో కొంతమంది పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే.. పెద్దవాళ్లు సర్థిచెప్పారు. గన్నవరం వెళ్లీపోతాం అక్కడ సీతమ్మ గారు అన్నం పెడతారన్నారట. ఆ మాట విన్న సీతమ్మ వెంటనే అంతర్వేది ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసి.. వాళ్ళకి అన్నం పెట్టాలని వెళ్ళిపోయారట. అంతేకాదు ఈమె గొప్పతన గురించి తెలుసుకున్న బ్రిటీష్ ఇండియా చక్రవర్తి 7వ ఎడ్వర్డ్.. పట్టాభిషేక వార్షికోత్సవానికి రావాలని 1903లో ఆమెకు ఆహ్వానం పంపారట. సీతమ్మ తాను రాలేను.. క్షమించని కోరారట.కొద్ది రోజుల తర్వాత తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆమె ఫోటో కోసం వెళితే తిరస్కరించారట. బ్రిటీష్ ప్రభువుల ఆదేశాలని.. ఫోటో తీయించుకోకపోతే తన ఉద్యోగం పోతుందని చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారట. తర్వాత ఆ బ్రిటిష్ చక్రవర్తి ఓ సోఫాలో సీతమ్మ ఫోటో పెట్టి నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నారట. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉందని చెబుతుంటారు. అంతేకాదు సీతమ్మ జీవిత చరిత్రను 1959లో శ్రీ మిర్తిపాటి సీతారామఛయనులు విరతాన్నధాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ పేరిట గ్రంథం రాశారట. అది ఆమె గొప్పతనం.. అందుకే ఆమె పేరుతో జనసేన ఇప్పుడు ఆహార శిబిరాలు ఏర్పాటు చేశారు.