స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ షేర్ల జోరు
ముంబై, నవంబర్ 15,
దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చరిత్ర సృష్టించింది. మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) పరంగా మూడో అతిపెద్ద సంస్థగా నిలిచింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వంటి దిగ్గజ కంపెనీల సరసన చోటు దక్కించుకుంది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ తాజాగా రూ.7 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించింది. దీంతో దేశంలో ఈ మార్క్‌ను అందుకున్న మూడో సంస్థగా రికార్డు కెక్కింది. అంతేకాదండోయ్.. ఈ ఘనత సాధించిన తొలి బ్యాంకుగా నిలిచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా ఇంతవరకు మరే ఇతర బ్యాంక్ కూడా ఈ మార్క్‌ను అందుకోలేకపోయింది.ఇకపోతే ఇప్పటి వరకు చూస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మాత్రమే రూ.7 లక్షల కోట్ల మైలురాయిని అందుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఏకంగా రూ.9.38 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. దీని తర్వాతి స్థానంలో టీసీఎస్ ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8.28 లక్షల కోట్లుగా ఉంది.ఎస్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు ధర ఈ రోజు 0.31 శాతం పెరుగుదలతో రూ.1,277.9 వద్ద ముగిసింది. ఈ షేరు ధర ప్రాతిపదికన చూస్తే.. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,03,071.27 కోట్లుగా ఉంది. బ్యాంక్ షేరు ఇంట్రాడేలో రూ.1,285 స్థాయికి కూడా తాకింది. ఇది 52 వారాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం.