YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పేరుకు భార్య... అన్నింటా భర్తే

పేరుకు భార్య... అన్నింటా భర్తే

పేరుకు భార్య... అన్నింటా భర్తే
విశాఖపట్టణం,
రాజకీయాల్లో మహిళా స్వాతంత్రం అలా పరిఢవిల్లుతోంది. భార్యకు అధికార పదవి ఉంటే చాలు భర్తలే రాజ్యం చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. పార్టీ పదవుల్లోనూ భర్తలే ముందుకు రావడమే అసలైన రాజకీయమవుతోంది. విశాఖ అర్బన్ జిల్లా తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా అక్రమాని విజయనిర్మలను పార్టీ నియమించింది. ఆరు నెలల క్రితం చివరి నిముషంలో అనూహ్యంగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆమెను ఎంపిక చేశారు. పార్టీలో వర్గ పోరు కారణంగానూ, అప్పటికి కొత్త కావడం చేతను ఆమె ఓడిపోయారు. ఇక ఆ తరువాత కూడా ఆమెనే పార్టీ ఇంఛార్జిగా ఉండమని బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా విజయనిర్మలతో పాటు ఆమె భర్త అక్రమాని రామునాయుడు కూడా పార్టీలో కీలకంగా ఉంటున్నారు. దాంతో ఆయనే అసలైన ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.నిజానికి తూర్పు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి స్థాన బలం ఉంది. ఆయనకు టికెట్ నిరాకరించడంతో మనస్థాపం చెంది పూర్తిగా పార్టీ కోసం పనిచేయలేదని అంటారు. ఫలితంగా విజయనిర్మల గెలిచే సీటుని కూడా కోల్పోయారు. ఇక ఆయన వర్గం ఇప్పటికీ వేరేగా ఉంటోంది. పార్టీ కార్యక్రమాలు కూడా విడిగానే నిర్వహిస్తున్నారు. మరో వైపు చూసుకుటే విజయనిర్మల ఇప్పటికీ పార్టీ పరంగా పట్టు సాధించలేకపోతున్నారు. దీనికి తోడు ఆమె భర్త ఆధిపత్యం కూడా చేటు తెస్తోందని అంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలసి పార్టీని బలోపేతం చేయడం మాట పక్కన పెడితే క్యాడర్ని అయోమయంలోకి నెడుతున్నారని అంటున్నారు. తొందరలో జీవీఎంసీ ఎన్నికలు రానున్నాయి. ఈ సమయంలో మొత్తం తూర్పు నియోజకవర్గంలో ఉన్న పార్టీని ఏకం చేసి నడిపించాల్సిన చోట సొంత పార్టీలోనే ఆధిపత్య ధోరణులు పెరగడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.విశాఖ తూర్పు రాజకీయం తీసుకుంటే టీడీపీ పటిష్టంగా ఉంది. ముచ్చటగా మూడు సార్లు అక్కడ నుంచి వెలగపూడి రామక్రిష్ణబాబు విజయం సాధించారు. ఆయన తన పట్టుని ప్రతీ ఎన్నికకూ పెంచుకుంటూ వెళ్తున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ వర్గ పోరుతో సతమతమవుతోంది. అదే సమయంలో అక్రమాని విజయనిర్మలతోనే సయోధ్య కుదరక వైసీపీ నేతలు ఉంటే మధ్యలో ఆమె భర్త రంగప్రవేశం చేయడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఇపుడు తూర్పులో మార్పు సంగతి దేముడెరుగు ఎవరికి వారే యమునా తీరుగా పాటీ నాయకులు ఉన్నారని అంటున్నారు. భర్తను పక్కన పెట్టి విజయనిర్మల సొంతంగా రాజకీయం చేయడంతో పాటు, నియోజకవర్గం ఇంచార్జిగా అందరినీ కలుపుకుని పోవాలని కార్యకర్తలు అంటున్నారు. ఇక మరో వైపు విశాఖ నగర ప్రెసిడెంట్ గా ఉన్న వంశీ కూడా మేయర్ గా గెలవాలంటే తన సొంత నియోజకవర్గంలో కూడా పార్టీ పటిష్టత గురించి ఆలోచన చేయాలని అంటున్నారు. చూడాలి హై కమాండ్ ద్రుష్టి పెడుతుందా. ఈ నేతలు అయినా దారికి వస్తారో లేదో వేచి చూడాలి

Related Posts