వారం లో భారీగా పెరిగిన కోడి
గుంటూరు,
కోడిమాంసం ధర ఒక్క వారంలోనే కిలోకి రూ. 50 పెరిగింది. గత వారం కిలో స్కిన్‌లెస్ రూ. 130కి లభించగా నేడు కిలో రూ. 180కి చేరింది. కూరగాయల ధరలూ పెరిగాయి. ఉల్లి ధర ఘాటు మళ్లీ కంటతడి పెట్టిస్తోంది. రైతుబజార్లలో ఉల్లిపాయలు కిలో రూ. 35కి అమ్ముతున్నా గానీ నాసిరకం దొరుకుతున్నాయి. గోళీకాయలంత సైజుల్లో ఉంటున్నాయని వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. గతంలో మాంసం ధరలు పెరిగితే కూరగాయల ధరలు అందుబాటులోకి వచ్చేవి. కానీ నేడు మాంసం, కూరగాయల ధరలు రెండూ పోటీపడి పెరగడంతో వినియోగదారులు ఆర్థిక భారంతో అల్లాడుతున్నారు. కార్తీక మాసంలో పూజలూ, నోములు ఉండగా మాంసాహారులు కూడా శాకాహారులుగా మారుతుంటారు. అలాంటి తరుణంలో కూరగాయల వినియోగం పెరుగుతుంది. కూరగాయల వ్యాపారులు, రైతుల పంట పండుతుంది. గత నెల రెండోవారంలో టమాటా కిలో రూ. 23లకే లభించగా ఈ నెల 6న కిలో రూ. 30కి రైతుబజారులో అమ్ముతున్నారు. అదే బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 40కి అమ్ముతున్నారు. బంగాళదుంపలు కిలో రూ. 18 నుండి నేడు రూ. 23కి చేరాయి. నాటు బీరకాయలు కిలో రూ. 28 నుండి రూ. 38కి పెరిగాయి. గత నెల దొండకాయలు కిలో రూ. 26లకే లభించగా నేడు రూ. 37కి చేరాయి. కాకరకాయలు కిలో రూ. 18 నుండి రూ. 22కి పెరిగాయి. గోరుచిక్కుళ్లు కిలో రూ. 18 నుండి రూ. 22కి, పచ్చిమిరపకాయలు మాత్రం కిలో రూ. 18 నుండి తగ్గి రూ. 15లకే లభిస్తున్నాయి. అలాగే వంకాయల ధరలు తగ్గి అందుబాటులోకి వచ్చాయి. కిలో రూ. 32 అమ్మిన వంకాయలు నేడు రూ. 26కి అందుబాటులోకి వచ్చాయి. చామదుంప మాత్రం కిలో నిలకడగా రూ. 28లకే లభిస్తున్నాయి. బీట్‌రూట్ కూడా ధర కిలో రూ. 28 నుండి రూ. 37కి చేరాయి. క్యారెట్ కిలో రూ. 48 నుండి రూ. 58కి ధర పెరిగాయి. ఫ్రెంచి బీన్స్ ధరలు మాత్రం కిలో రూ. 52 నుండి రూ. 34కి తగ్గాయి. కీరదోస కూడా అందుబాటులోకి వచ్చింది. కిలో రూ. 32 నుండి రూ. 18కి చేరింది. నిత్యం వాడకం ఎక్కువగా ఉండే టమాటా, ఉల్లిపాయల ధరలు పెరిగాయి. ఉల్లిపాయలు బుధవారం బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 60 నుండి రూ. 65కి ధర పెరిగింది.