కమలంలో కలవరమాయెమదిలో...
ముంబై, నవంబర్ 16
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ శివసేన భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుచూపడం లేదు. దిగివస్తే ఇక భవిష్యత్ ఉండదని భావించిన శివసేన భవిష్యత్తులోనూ శివసేన, కాంగ్రెస్ తోనే వెళ్లేందుకు సిద్ధమయినట్లు కన్పిస్తుంది. రాష్ట్రపతి పాలన గడువు ఆరు నెలల వరకూ ఉండటంతో ఈలోపు కాంగ్రెస్, ఎన్సీపీలతో పూర్తి స్థాయి అవగాహనకు రావాలని శివసేన నిర్ణయించింది. తమకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన అమిత్ షా కూడా మాట మార్చడంతో ఇక భవిష‌్యత్తులో బీజేపీతో పొత్తు వద్దనకుంటోంది.మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మళ్లీ కసరత్తులు మొదలు పెట్టింది. తిరిగి ప్రభుత్వ ఏర్పాటు చేసేంత వరకూ తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా చర్యలు తీసుకుంది. సుదీర్ఘకాలం క్యాంపు రాజకీయాలు నడపలేమని భావించిన శివసేన ప్రతి పది మంది ఎమ్మెల్యేలకు ఒక బాధ్యుడిని నియమించినట్లు తెలుస్తోంది. వారు నిత్యం ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండి వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని మాతృశ్రీకి నివేదించాల్సి ఉంటుంది.మరోవైపు శివసేనకు మద్దతివ్వడంపై కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా పునరాలోచనలో పడ్డాయి. రాష్ట్రపతి పాలన ఇంత త్వరగా విధిస్తారని ఊహించని కాంగ్రెస్, ఎన్సీపీలు చివరకు శివసేనకు మద్దతివ్వాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు ఎన్సీపీ నేతలు కూడా సంకేతాలు పంపారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే మూడు పార్టీలూ చర్చలు ప్రాంరంభించాయి. కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టుకుని ముందుకు వెళ్లడమే మంచిదని భావిస్తున్నాయి.ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశమవుతున్నారు. కామన్ మినిమం ప్రోగ్రాం పై వీరు చర్చించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ పార్టీలోనూ ఎలాంటి అపోహలు తలెత్తకుండా ముందుగానే అన్ని రాతపూర్వకంగా ఉండాలన్నది కాంగ్రెస్ అభిప్రాయం. ఈ మేరకు కామన్ మినిమం ప్రోగ్రాంకు సంబంధించి ముసాయిదాను కూడా మూడు పార్టీల నేతలు కలసి రూపొందించారు. దీనికి సోనియా గాంధీ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. మొత్తం మీద శివసేన భవిష్యత్తులో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీలతోనే కలసి వెళ్లాలని నిర్ణయించుకుంది