కన్నడలో బీజేపీలో అసంతృప్తి, తిరుగుబాట్లు
బెంగళూర్ నవంబర్ 16
కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగుతున్న సమయంలో అధికార భారతీయ జనతా పార్టీలో అసంతృప్తి భగ్గుమంటోంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు కేటాయిచండంతో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన బీజేపీ నేతలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. బీజేపీలో కొత్త పోకడలకు యడ్యూరప్ప తెరదీశారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. బీజేపీలో అసంతృప్తి, తిరుగుబాట్లు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చేలా ఉన్నాయి.అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడంతో కర్ణాటక బీజేపీలో అసంతృప్తి భగ్గుమంది. తమకు పట్టున్న స్థానాల్లో మొన్నటివకూ ప్రత్యర్థిగా ఉన్న నేతకు పార్టీ కండువాను కప్పడాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. వీరి అనుచరులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగారు. వీరిలో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాము గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజారిటీతోనే ఓటమి పాలయ్యామని, తమకు కాకుండా వేరొకరిని నియోజకర్గంలో తెచ్చి పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.హోసకోటకు చెందిన శరత్ బచ్చే గౌడ నామినేషన్ దాఖలు చేశారు. ఈయన హోసకోట టిక్కెట్ ను ఆశిస్తున్నారు. శరత్ తండ్రి బచ్చేగౌడ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. హోసకోటలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యే ఎంబీటీ నాగరాజుకు టిక్కెట్ ఖరారు కావడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కాగవాడ మాజీ ఎమ్మెల్యే రాజు కాగే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.ఇక గోకాక్ నియోజకవర్గంలోనూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీని ఇరుకున పెట్టాలని అశోక్ పూజారి సిద్ధమయ్యారు. ఇలా యడ్యూరప్ప అలా అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ఇలా నామినేషన్ దాఖలు చేయడం ఆందోళన కల్గిస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మురళీధరరావు కర్ణాటకలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు హైకమాండ్ కు నివేదిస్తున్నారు. వారిని బుజ్జగించే బాధ్యతలను కొందరు నేతలపై పెట్టినట్లు తెలిసింది. బీజేపీ నేతలు రెబల్స్ గా పోటీ చేస్తే ఎవరికి నష్టమన్నది అందరికీ తెలిసిందే. మరి వీరు అధినాయకత్వం బుజ్జగింపులకు లొంగుతారా? లేక పోటీలో కంటిన్యూ అవుతారా? అన్నది చూడాల్సి ఉంది.