బొత్స నిరాశ వెనుక
విశాఖపట్టణం, నవంబర్ 16
బొత్స సత్యనారాయణ మాస్ పొలిటీషియన్. అంతవరకూ నిజమే. కానీ ఆయనకు పార్టీ అండ లేకుండా గెలవలేరన్నది 2014 ఎన్నికల్లో రుజువయింది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఆయనకు విజయం దక్కలేదు. అంటే బొత్స సత్యనారాయణకు పార్టీ అండలేకపోతే గెలుపు కష్టమేనన్నది ఆనాడే తెలిసింది. అయితే నాటి ఎన్నికల్లో తనకు డిపాజిట్లు దక్కడమే బొత్స సత్యనారాయణకు ఊరట కల్గించే అంశం.అయితే ఇప్పుడు మంత్రి అయిన బొత్స సత్యనారాయణ పదే పదే ఒక మాట అంటున్నారు. తాను రెండు మెట్లు దిగి వైసీపీలో చేరాల్సి వచ్చిందంటున్నారు. ఈ వ్యాఖ్య బొత్స సత్యనారాయణ అనాలోచితంగా చేసింది కాదు. ఆలోచించి… చేసిందేనని చెప్పక తప్పదు. జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రిగా, ప్రాధాన్యత కలిగిన మున్సిపల్, సీఆర్డీఏ మంత్రిగా ఆయన బాధ్యతలు చూస్తున్నారు. జగన్ కూడా బొత్స సత్యనారాయణకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు.బొత్స సత్యనారాయణ బాధపడుతుంది కొన్ని విషయాల్లో మాత్రమే. జిల్లా రాజకీయాల్లో తనను జీరోను చేయాలన్న ప్రయత్నం ఆయనకు రుచించడం లేదు. దీంతో పాటు కీలక నిర్ణయాల్లో తనను జగన్ భాగస్వామిని చేయడం లేదన్నది మరో బాధ. జగన్ ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక నిర్ణయాలు పార్టీని పటిష్టపర్చేవే. అయితే సీనియర్ నేతను అయిన తనను సంప్రదించకుండా, సలహాలు తీసుకోకుండా జగన్ ముందుకు వెళుతున్నారన్నద బొత్స సత్యనారాయణ తన సన్ని హితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం.తనను కేవలం ఒక శాఖకు మంత్రిగానే జగన్ చూస్తున్నారని, సీనియర్ ని అయినా నెంబరు 2 అనిపించుకోలేకపోతున్నానని బొత్స సత్యనారాయణ ఫీలవుతున్నారని తెలిసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిధున్ రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత కూడా తనకు దక్కడం లేదన్నది బొత్స సత్యనారాయణ ఆవేదనగా ఉంది. అందుకే ఆయన పదే పదే మెట్లు దిగి వైసీపీలో చేరారంటున్నారు. అయితే బొత్స వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా సెటైర్లు వేస్తున్నారు. బొత్సకు ఏం అన్యాయం జరిగిందని.. మంత్రి పదవితో పాటు ఫ్యామిలీ ప్యాకేజీలో టిక్కెట్లు కూడా కొట్టేశారు కదా? అని సెటైర్ వేస్తున్నారు. ఇలా బొత్స సత్యనారాయణ మెట్లు దిగివచ్చిన కథ సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది.