YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

23 ఏళ్ల తర్వాత టీడీపీలో మళ్లీ సంక్షోభం

23 ఏళ్ల తర్వాత టీడీపీలో మళ్లీ సంక్షోభం

23 ఏళ్ల తర్వాత టీడీపీలో మళ్లీ సంక్షోభం
విజయవాడ, నవంబర్ 16
తెలుగుదేశం పార్టీలో ఇరవై మూడేళ్ళ తరువాత మళ్ళీ రాజకీయ సంక్షోభం రగులుకుంటోంది. సరిగ్గా ఒకే ఒక్క వ్యక్తి మీద నాడు, నేడు తీవ్ర వ్యతిరేకత నుంచి ఈ మంటలు పుట్టడం విశేషం. నాడు రెండవ భార్యగా లక్ష్మీ పార్వతిని తన పక్కన ఉంచుకున్న ఎన్టీయార్ ఆమె సలహాలు పూర్తిగా వినేవారని, ఎవరినీ దగ్గరకు చేరదీయడం లేదన్న ఆక్రోశం నుంచి టీడీపీలో పెను తుఫాన్ పుట్టుకొచ్చింది. దానికి ఈనాటి టీడీపీ అధినేత చంద్రబాబే నాయకత్వం వహించారు. ఇపుడు చంద్రబాబు అదే డెబ్బయి ఏళ్ళ వయసులో ఉన్నారు. ఇపుడు చంద్రబాబు లోకేష్ మీద మోజుతో ఉన్నారు. చినబాబు సలహాలు విని పార్టీని నడుపుతున్నారని తమ్ముళ్ళ అభియోగం. పార్టీని వీడిపోతున్న వారంతా చెబుతున్న మాట కూడా ఇదే. అంటే మళ్ళీ 1995 నాటి ఆగస్ట్ సంక్షోభం రోజులు గుర్తుకువస్తున్నాయన్నమాట.పార్టీని వీడిపోతూ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ డైరెక్ట్ గా చినబాబుకే తాకాయి. వర్థంతులు, జయంతులకు తేడా తెలియని వారు ఇపుడు పార్టీని లీడ్ చేస్తున్నారంటూ వంశీ వేసిన సెటైర్లు చంద్రబాబుని కూడా బాధించే ఉంటాయి. పార్టీ సర్వనాశనం అయిపోతోందని కూడా వంశీ జోస్యమే చెప్పారో శాపనార్ధాలే పెట్టారో తెలియదు కానీ టీడీపీ పోకడలను గట్టిగా కడిగిపారేశారు. మూల బిందువుగా ఉన్న లోకేష్ నే ఆయన టార్గెట్ చేశారు. ఇక పార్టీ నుంచి వీడిపోయిన మరో నేత దేవినేని అవినాష్ సైతం లోకేష్ మీదనే తన విమర్శలు ఎక్కుపెట్టడం విశేషం. చినబాబు రాజ్యంలో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదని వాపోయారు. అప్పట్లో కూడా లక్ష్మీపార్వతి భార్యగా వంటింట్లో ఉండకుండా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని తమ్ముళ్ళు ఆరోపించిన సంగతి ఈ సందర్భంగా గుర్తుకురాకమానదు.తెలుగుదేశం పార్టీ విషయంలో ఆది నుంచి చంద్రబాబు పక్కన ఉంటూ మంచీ చెడ్డా చెప్పే సుజనా చౌదరి కూడా బీజేపీలో చేరడం వెనక లోకేష్ పొడ గిట్టకపోవడమే అన్న ప్రచారం కూడా ఉంది. లోకేష్ కి సుజనా చౌదరికి చెడిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీతో పొత్తు తెంచుకోవద్దని సుజనా చెప్పారని వంశీ తాజాగా చెప్పడం విశేషం. మరి పొత్తు పెటాకులు చేసింది, చేయించింది ఎవరంటే మళ్ళీ చినబాబు మీదకే అందరి చూపులూ వెళ్తున్నాయి. దాని వెనక ఓ పత్రికాధిపతి హస్తం కూడా ఉందని అంటారు.మరి ఇలా పార్టీలో లోకేష్ మీద పూర్తిగా వ్యతిరేకత ఉండడం వల్లనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తో సహా చాలా మంది బయటకు పోవాలనుకుంటున్నారని అంటున్నారు. బాబు వరకూ తాము నాయకత్వాన్ని అంగీకరిస్తామని, లోకేష్ ని నెత్తిన రుద్దితే సహించేది లేదని టీడీపీలో చాలాకాలంగా వినిపిస్తున్న మాటగా ప్రచారంలో ఉంది. మరి నాడు లక్ష్మీ పార్వతి వైపు ఉండి ఎన్టీయార్ ముఖ్యమంత్రి పదవి ఫణంగా పెట్టారంటారు.ఇపుడు కుమారుడి పక్షాన ఉండి చంద్రబాబు టీడీపీని ఏం చేయదలచుకున్నారన్న ప్రశ్న పసుపు శిబిరంలో గట్టిగా వినిపిస్తోంది.మరి దీనికి హై కమాండ్ జవాబు చెప్పకపోతే కాలమే చెబుతుందని అంటున్నారు.

Related Posts