తెల్లవారుజామున ఆరెస్టులు
యాదాద్రి నవంబర్ 16
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో శనివారం కుడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. ఆర్టీసీ కార్మికులు డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటారనే ముందస్తు సమాచారంతో తెల్లవారుజాముననే కార్మికుల ఇండ్లలోకి వెళ్లి మరీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు. దీంతో పోలీసులతో కార్మికులు వాగ్వాదానికి దిగారు. ఇండ్లలో నిద్రపోతున్న మమ్మల్ని లేపి మరీ అరెస్ట్ చేసే అధికారం మీకెవరిచ్చారని వాగ్వాదానికి దిగారు మహిళా కార్మికులు. మా ఇండ్లలో మేము ఉండే హక్కు కూడా మాకు లేదా అని పోలీసులను నిలదీశారు. పోలీసు వాహనాల్లో పీఎస్ తరలించడాన్ని నిరాకరించారు కార్మికులు. అసలు మహిళా పోలీసులు లేకుండా మహిళలను ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులు. దీంతో ఉమెన్ పీసీని రప్పించిన పోలీసులు, మహిళా కానిస్టేబుళ్లతో కార్మికులను దౌర్జన్యంగా లాక్కెళ్లి పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. దీంతో సీఎం కేసీఆర్ డౌన్ డౌన్.. పోలీసుల దౌర్జన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు కార్మికులు. పోలీస్ వాహనాల్లోకి ఎక్కించిన కార్మికులను పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం కార్మికుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు అఖిలపక్ష నేతలు. కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిపో నుంచి బయటకు వెళ్తున్న బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో, అఖిలపక్ష పార్డీల నేతలను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు పోలీసులు.