ఇన్నింగ్స్ 130 పరుగులతో భారత్ గెలుపు
ఇండోర్, నవంబర్ 16,
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. శనివారం 343 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన బంగ్లాదేశ్ టీమ్.. భారత బౌలర్ల దెబ్బకి 213 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఇక రెండో టెస్టు మ్యాచ్ శుక్రవారం నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు.. మొదటి రోజే 150 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. గురువారం చివరి సెషన్‌లోనే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (243: 330 బంతుల్లో 28x4, 8x6) డబుల్ సెంచరీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె (86: 172 బంతుల్లో 9x4), రవీంద్ర జడేజా (60 నాటౌట్: 76 బంతుల్లో 6x4, 2x6), చతేశ్వర్ పుజారా (54: 72 బంతుల్లో 9x4) అర్ధశతకాలు బాదడంతో 493/6తో ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది.ఆటలో మూడో రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టులో ముష్ఫికర్ రహీమ్ (64: 150 బంతుల్లో 7x4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ మూడు, ఉమేశ్ యాదవ్ రెండు ,ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకూ ఏడు టెస్టులు జరగగా.. టీమిండియా ఆరింట్లో గెలుపొందింది. ఒక మ్యాచ్ మాత్రం డ్రాగా ముగిసింది.