ఇంటర్ వరకూ స్కూళ్లలోనే
శ్రీకాకుళం,
ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇక లోకల్ కానుంది. దీంతో వచ్చే ఏడాది నుంచి జిల్లా పరిషత్ స్కూళ్లలో ఇంటర్ ను ప్రవేశపెట్టనున్నారు. బాలికలను దూరంగా ఉన్న కళాశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. చదువులకు బలవంతంగా దూరం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజాసంకల్పయాత్రలో పలువురు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. తల్లిదండ్రుల కోరిక మేరకు... ప్రభు త్వ విద్యను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాలలోనే ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. విద్యావేత్తల సూచనల మేరకు 500 మంది పిల్లలుండే పాఠశాలల్లో తొలివిడతలో ఇంటర్ తరగతుల నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంపిక చేసిన మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కళాశాల విద్య ఆరంభం కానుంది. ఈ మేరకు మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ 500 మం ది విద్యార్థులు చదువుతున్న పాఠశాలల వివరాలను సేకరించింది. యూ–డైస్ నివేదికలో విద్యార్థుల వివరాల నమోదు ఆధారంగా జిల్లాలో 21 పాఠశాలల్లో 500 మంది విద్యార్థులు దాటి చదవుతున్నట్టు గుర్తించింది. ఈ పాఠశాలలు వచ్చే ఏడాది నుంచి కళాశాలలుగా మార్చేందుకు అర్హత పొందాయి. వీటిలో జిల్లా పరిషత్ యాజమాన్యంలో ఉన్నవి 19, కార్పొరేషన్ పరిధిలో 3, ప్రైవేటు ఎయిడెడ్ 1, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల ఒకటి ఉన్నాయి. కార్పొరేషన్‌కు చెందిన విజయనగరం నగరపాలక కస్పా ఉన్నత పాఠశాల, బీపీఎంహెచ్‌స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చీపురుపల్లి, రామభద్రపురం, మక్కువ, పూసపాటిరేగ, జా మి, బలిజిపేట, కుమరాం, జొన్నవలస, కొత్తవలస, మెట్టపల్లి, పార్వతీపురం, పాంచాలి, తెర్లాం, బుడతనాపల్లి, ధర్మవరం, బాడంగి, అలుగోలు, గజపతినగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉన్నాయి. వీటిలో కళాశాల విద్య బోధిస్తే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. ఇంటర్ విద్య ఊరిబడిలోనే చదువుకోవచ్చని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలను కలుపుకొని జిల్లాలో 184 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 21 వృత్తి విద్య కళాశాలలను మినహాయిస్తే 165 ఇంటర్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. 24 ప్రభుత్వ, 82 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మిగిలినవి వివిధ యాజమాన్యాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వ విద్యలో జూనియర్ కళాశాలలకు డిమాండ్ జిల్లాలో ఏళ్లుగా సాగుతోంది. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ మేరకు ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు కొన్నాళ్లుగా ఆందోళనలు చేపట్టాయి. అధికారులు వీటిపై పరిశీలించి పలు దఫాలుగా ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో గుర్ల, గరుగుబిల్లి, బొండపల్లి, మెరకముడిదాం, దత్తిరాజేరు మండలాల్లో డిమాండ్ మేరకు ఇంటర్‌బోర్డు అధికారులు పరిశీలించి ఫీజుబులిటీ ఉందని బోర్డుకు నివేదించారు. మూడేళ్లుగా ఈ ప్రతిపాదనలపై కదలిక లేదు. గత ఏడాది ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా 2019–20 విద్యాసంవత్సరం నుంచి గత ప్రభుత్వం దత్తిరాజేరు, మెరకముడిదాంలో ఇంటర్ కళాశాలలను ఏర్పాటు చేసింది. కార్యరూపం దాల్చడంతో సామాన్య, మధ్య తరగతి విద్యార్థులు రుసుములు భారం తగ్గి ఉన్నత విద్యను అందుకునే వీలు కలిగింది. ఇంకో ఏడు కళాశాలల ప్రతిపాదనల్లో ఉన్నాయి