యాక్టివ్ కాలేకపోతున్న పార్లమెంట్ సభ్యులు
విజయవాడ, నవంబర్ 18
రాష్ట్రంలో అనూహ్యమైన సంఖ్యలో ఎంపీలను దక్కించుకుంది వైసీపీ. రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాల్లో అనితర సాధ్యంగా 22 మందిని గెలిపించుకుని అత్యంత కీలకమైన రికార్డును సొంతం చేసుకుంది. బహుశ రాబోయే ఎన్నికల్లో ఇదే పార్టీ కానీ, ఏ ఇతర పార్టీలు కానీ ఈ రేంజ్‌లో మళ్లీ ఇలాంటి రికార్డుస్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటాయా ? అనే రేంజ్‌లో వైసీపీ రికార్డ్ సృష్టించింది. మరి ఇంత మంది ఎంపీలు గెలిచిన తర్వాత.. ఏపీలో ఏదో అద్భుతం జరిగిపోతుందని,కేంద్రానికి ఏపీకి మధ్య ఉన్న గ్యాప్ పూర్తిగా తొలి గిపోతుందని అందరూ అనుకున్నారు. నిజానికి ఎన్నికల సమయంలో జగన్ కూడా ఇలానే చెప్పారు కాబట్టి.. అందరూ ఆశలు కూడా పెట్టుకున్నారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున కూడా ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఏపీ ప్రజలు వైసీపీకి 22 మంది ఎంపీలను ఇచ్చినా అసలు హోదా అన్న అంశమే ఆ పార్టీ ఎత్తడం లేదు. పార్లమెంటులో సైతం వైసీపీ ఎంపీలు అసలు హోదా ? అన్న విషయం ఒకటి ఉందని మర్చిపోయారు. ఈ 22 మంది వైసీపీ ఎంపీలు పెద్దగా ప్రజా సమస్యలపైనా, రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. వీరిలో ఎక్కువ మంది తొలిసారి ఎంపీలు అయిన వారు కూడా ఉన్నారు. దీంతో వీరికి పట్టు లేకుండా పోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.వీరిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వంటివారు వ్యాపారాల్లో మళ్లీ మునిగిపోయారు. ఇక, జగన్‌కు దగ్గర బంధువులు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి ఏదో ఉన్నామంటే.. ఉన్నామని అనుకుంటున్నారు. అవినాష్‌రెడ్డి రెండోసారి గెలిచినా ఆయన మాట కడపలోనే వినపడే పరిస్థితి లేదు. ఇక మిథున్‌రెడ్డి మాత్రం పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్నారు. ఆయనకు కూడా పార్టీలో ప్రయార్టీ ఉన్నా వ్యాపారాలపైనే మక్కువ ఎక్కువంటారు. ఇక వీరంతా ఏం చేయాలన్నా.. పార్టీలో విజయసాయిరెడ్డికి చెప్పి చేయాల్సి రావడంతో వీరికి ఇగో అడ్డం వస్తున్నట్టు అనుచరులు చెప్పుకొంటున్నారు.ఇక, బెల్లాన చంద్రశేఖర్, నందిగం సురేష్‌లు ఎన్నికైతే అయ్యారు తప్ప.. నియోజకవర్గంలో ఏం చేయాలో .. అధికారులతో ఎలా మెలగాలో కూడా తెలియకపోవడం గమనార్హం. విజయనగరం జిల్లాలో బెల్లాన మాట వినపడే పరిస్థితి లేదు. నందిగం బాపట్లలో పార్టీ ఎమ్మెల్యేలతో గొడవకు దిగి వివాదాల్లో పడ్డారు. ఇక, వంగా గీత వంటి మహిళా ఎంపీల పరిస్థితి కూడా ఇంతే. ఆమె గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసినా కనీసం ఆ సీనియార్టీ ఉపయోగించి అయినా మాట్లాడలేని పరిస్థితి. ఇక మిగిలిన వారిలో చాలా మంది కొత్తవారు కావడం, జగన్ పై అత్యంత అభిమానం పెంచుకొని ఉండడంతో ఏం చేయాలో తెలియక, కేవలం వైసీపీ కార్యాలయాలకే పరిమితమవుతున్నారు.అనకాపల్లి వైసీపీ ఎంపీ సత్యవతి, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక ఉన్న వారిలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్.. కొంచెం ఫర్వాలేదు. నియోజకవర్గంలో సమస్యలను పట్టించుకుంటున్నారు. అదే విధంగా ఏలూరు ఎంపీ శ్రీధర్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. నియోజవకర్గంలో సమస్యలను పరిష్కరించేందు కు తనవంతు ఎంతో శ్రమ చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టు బడులు రప్పించేందుకు విదేశాల్లో తనకు ఉన్న పరిచయాలు వాడుకుని మరీ కృషి చేస్తున్నారు.ఈ వరుసలోనే తొలిసారి వైసీపీ ఎంపీగా ఎన్నికైనా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు కూడా నియోజకవర్గం కోసం చాలా కష్టపడుతున్నారు. కేంద్రం నుంచి నియోజక వర్గానికి రావాల్సిన నిధులు, ఇతర సంస్థలపై ఆయన దృష్టి పెట్టారు. వెనకపడిన పల్నాడు నుంచి ఎంపీగా ఉన్న ఆయన ఆ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థల ఏర్పాటు తదితర అంశాలపై తీవ్రంగా కృషి చేయడంతో పాటు నియోజకవర్గంలో కలియ దిరుగుతున్నారు. ఇక, మిగిలిన వారు ఉన్నామంటే ఉన్నామని హాజరు వేయించుకుంటున్నారు. ఏదో కొన్ని కొన్ని ప్రారంభోత్సవాల్లో తప్ప ఎంపీలు బయటకు రావడంలేదు. సీమ ఎంపీలుగా ఉన్న వాళ్లంతా ఏం చేస్తున్నారో ? ఎక్కడ ఉన్నారో అర్థం కావడం లేదు. వీరంతా గెలిచి ఆరు నెలలు కావొస్తున్న ఎంపీలు ఇంకా రెస్ట్ మోడ్‌లోనే ఉండడం వల్ల పార్టీకి ఇబ్బందే అవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.