చక్రం తిప్పేందుకు తండ్రి, కొడుకులు
బెంగళూర్, నవంబర్ 18
ఉప ఎన్నికల్లో జనతాదళ్ తొలి నుంచి రాంగ్ స్టెప్ లు వేస్తూనే వస్తుంది. జనతాదళ్ ఎస్ అధినేతలు దేవెగౌడ, కుమారస్వామి చేసిన ప్రకటనలతో క్యాడర్ లోనూ, ఇటు పార్టీ ఓటర్లలోనూ అయోమయం నెలకొనేలా చేశారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు మట్లాడిన మాటలు, ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలకు పొంతన లేకుండా ఉండటమే ఇందుకు కారణం. కర్ణాటకలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి వేయవచ్చు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.ఈ దశలో ఒక స్ట్రాటజీతో వెళ్లాల్సిన దళపతులు దేవెగౌడ, కుమారస్వామి చేసిన ప్రకటనలు ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారాయి. నోటిఫికేషన్ కు ముందు తాము ఒంటరిగా పోటీచేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుప్ప కూలిపోకుండా తాము అండగా ఉంటామని దేవెగౌడ, కుమారస్వామి ప్రకటించారు. దీంతో పార్టీలో అసంతృప్తి బయలుదేరింది. బీజేపీతో ఎలా కలుస్తారని ఒకవర్గం గట్టిగానే అభ్యంతరం వ్యక్తం చేసింది.దీంతో దిగివచ్చిన దళపతులు కుమారస్వామి, దేవెగౌడలు బీజేపీ, కాంగ్రెస్ లకు సమానదూరంగా ఉంటామని ప్రకటించాల్సి వచ్చింది. ఇన్ని విభిన్న ప్రకటనల మధ్య ఎన్నికలకు వెళితే ప్రజలు నమ్ముతారా? అన్నదే ప్రశ్న. పదిహేనుకు పదిహేను సీట్లు గెలిచినా కుమారస్వామి కాంగ్రెస్ కు మద్దతివ్వరన్నది తేలిపోయింది. దీంతో కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉండేవారు, జేడీఎస్ అభిమానులు ఎవరికి ఓటేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీకి అండగా ఉంటామన్న ప్రకటన కూడా ఇదే రీతిలో ఎవరికి సానుకూలంగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.ఏదిఏమైనప్పటికీ జనతాదళ్ ఎస్ పది చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం పదిహేను స్థానాలకు గాను పది నియోజకవర్గాల్లో తమ అభర్థులు పోటీ చేయనున్నట్లు కుమారస్వామి తెలిపారు. తమకు పట్టున్న ప్రాంతాల్లోనే అభ్యర్థులను ప్రకటించామని, మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపకుండా ఎవరికి మద్దతివ్వాలో త్వరలో నిర్ణయిస్తామని కుమారస్వామి తెలిపారు. మొత్తం మీద పది స్థానాల్లోనే కుమారస్వామి పార్టీ పోటీ చేయనుంది. ఈ పది స్థానాల్లో కనీసం ఏడు నుంచి ఎనిమిది స్థానాలను గెలుచుకుని మరోసారి కింగ్ మేకర్ అవ్వాలని కుమారస్వామి యోచిస్తున్నారు. మరి సాధ్యమవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.