కల దిశగా అద్వానీ చిరకాల స్వప్నం
న్యూడిల్లీ, నవంబర్ 18
అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన రామాలయం నిర్మించాలన్నది బీజేపీ, దాని అనుబంధ సంస్థల ఆలోచన. ఈ చిరకాల స్వప్నం సాకారం చేసే ప్రక్రియలో భాగంగా అనేకమంది నాయకులు త్యాగాలు చేశారు. అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్, అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియా వంటి వారు పట్టుదలతో పనిచేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో ఎల్ కె అద్వానీ పాత్ర మరింత ప్రత్యేకం. అద్వానీ అంటే అయోధ్య… అయోధ్య అంటే అద్వానీ గా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పి), భజరంగదళ్ వంటి సంస్థల ప్రయత్నాలకు రాజకీయంగా మద్దతు ఇచ్చి దన్నుగా నిలబడింది అద్వానీ. ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ప్పుడే అయోధ్య ఉద్యమానికి విస్తృత ప్రచారం కల్పించారు. ఉర్రూత లూగించారు. రామాలయ నిర్మాణ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు రధయాత్ర కు శ్రీకారం చుట్టడం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. కేంద్రంలో నాటి వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే రామాలయ నిర్మాణానికి ఆయన పై వత్తిడి తీసుకు వచ్చారు. చర్చల ప్రక్రియ ఫలించకపోవడంతో రధయాత్ర ద్వారా ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్నారు ఎల్ కె అద్వానీ. తద్వారా దేశ రాజకీయ గతినే మార్చారు. తనపై అతివాదిగా ముద్రపడినప్పటికీ పార్టీని కేంద్రంలో అధికారం దిశగా నడిపించారు.ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన గుజరాత్ లోని సోమనాధ్ నుంచి అయోధ్యకు పాదయాత్ర చేయాలని తొలుత ఎల్ కె అద్వానీ భావించారు. సోమనాధ్ ఆలయాన్ని ముస్లిం పాలకులు ధ్వంసం చేశారు. స్వాతంత్ర్యం అనంతరం నాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో దానిని పునర్నిర్మించారు. పటేల్ భావజాలం, తమదీ ఒకటేనని బీజేపీ భావిస్తుంది. అందుకే ఆయనను తమవాడిగా చెప్పుకుంటుంది. సోమనాధ్ ను ఎంచుకోవడానికి కారణం ఇదే. ఇటీవల కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన జమ్మూకాశ్మీర్, లడాఖ్ లను కూడా పటేల్ జన్మదినమైన అక్టోబరు 31వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. రధయాత్రకు గుజరాత్ ను ఎంచుకోవడానికి మరో కారణం ఉంది. అప్పట్లో గుజరాత్ లో బీజేపీ అధికారంలో లేనప్పటికీ రాజకీయంగా బలంగా ఉంది. దీంతో 1990 సెప్టంబరు 25న అద్వానీ సోమనాధ్ నుంచి రధయాత్ర ప్రారంభించారు. అక్టోబరు 30 నాటికి అయోధ్య చేరాలన్నది లక్ష్యం. మొత్తం 10వేల కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా ఎల్ కె అద్వానీ పెట్టుకున్నారు.బీజేపీ అంచనాల మేరకు గుజరాత్ లో రధయాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. పల్లెలు, పట్టణాల నుంచి ప్రజలు పెద్దయెత్తున తరలివచ్చారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ లోనూ ఎల్.కె అద్వానీ రధయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. రామాలయ అంశాన్ని, సాస్కృతిక జాతీయ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు ఎల్.కె. అద్వానీ. వివిధ వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించింది. రధయాత్రను అడ్డుకోవడానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయి. రధయాత్రను అడ్డుకోవడం ద్వారా లౌకిక శక్తులుగా చాటుకోవడానికి, హిందూయేతర, మైనారిటీల ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి కొందరు ముఖ్యమంత్రులు ప్రయత్నించారు. అద్వానీని అరెస్టు చేసి హీరోలుగా చాటుకోవడానికి పోటీ పడ్డారు. వీరిలో అప్పటి బీహార్, యూపీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లు ఉన్నారు. రధయాత్ర యూపీలో ప్రవేశించినప్పుడు అద్వానీని అరెస్ట్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి ములాయం సింగ్ కు ఖ్యాతి దక్కుతుందన్న ఉద్దేశ్యంతో లాలూ ప్రసాద్ యాదవ్ తొందరపడ్డారు. అక్టోబరు 24న రధయాత్ర యూపీలోని దేవరియాలో ప్రవేశించాల్సి ఉండగా అంతకు ముందు రోజు బీహార్ లోని సమస్తిపురలో ఎల్.కె. అద్వానీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు ఈ పట్టణాన్ని ఎంచుకోవడానికి కారణం ఉంది. ఇది దివంగత మాజీ ఉప ప్రధాని, దళిత నాయుడు బాబూ జగజ్జీవన్ రాం నియోజకవర్గం కావడం కారణమని చెప్పక తప్పదు.ఎల్.కె. అద్వానీని అరెస్ట్ చేసి “దుమ్కా” సమీపంలోని ఇరిగేషన్ బంగ్లాలో ఉంచారు. ప్రస్తుతం ఈ ప్రాంతం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఎల్.కె. అద్వానీ అరెస్టుకు ప్రతిగానే పశుదాణా కుంభకోణం లో బీజేపీ ప్రభుత్వం లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో పెట్టించారన్న వాదన ప్రచారంలో ఉంది. దీనిని తోసి పుచ్చలేం కూడా. రధయాత్రకు పూనుకోవడం ద్వారా అయోధ్య అంశాన్ని ఎల్.కె. అద్వానీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. హిందువుల దృష్టిలో హీరోగా నిలిచారు. పార్టీలో ఇతర నాయకులను పక్కన పెట్టి ప్రముఖుడిగా ఎదిగారు. తనపై హిందూ అతివాదిగా ముద్రపడినప్పటికీ లెక్క చేయలేదు. చివరకు చట్టం ద్వారా రామాలయ నిర్మాణానికి భావపరిచారు. ఇటీవలే 92వ పుట్టిన రోజును జరుపుకున్న ఈ బీజేపీ కురువృద్ధుడు కోర్టు తీర్పు ద్వారా లక్ష్యం నెరవేరిందని ప్రకటించారు. అందువల్ల అయోధ్య అంటే అద్వానీ… అద్వానీ అంటే అయోభ్య అన్న వ్యాఖ్య అర్థవంతమైనదే.