దోమలతో జనం బేజారు
రంగారెడ్డి, నవంబర్ 18,
దోమ కాటు వల్ల విజృంభిస్తున్న వ్యాధులతో భాగ్యనగర వాసులు బెంబేలెత్తుతున్నారు. నగరంలో దోమలు స్వైర్య విహారం చేస్తూ పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజలను కాటు వేస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో దోమల బాధ మరింత తీవ్రంగా ఉంది. గాంధీ, ఉస్మానియా ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు వస్తున్న డెంగీ, మలేరియా రోగుల్లో అధికశాతం శివారు ప్రాంతాలకు చెందినవారే ఉండటం గమనార్హం. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో పాశుద్ధ్య పనులు పర్యవేక్షించే వారు లేక పరిస్థితి ఘోరంగా అయారవుతోంది.దోమలను నియంత్రించడానికి జీహెచ్‌ఎంసీలో ప్రత్యేకంగా ఎంటమాలజీ విభాగం ఉన్నా సక్రమంగా విధులు నిర్వహించటం లేదు. దోమల లార్వా నివారణకు మాలాథిన్, ఫాగింగ్ లాంటి చర్యలను చేపట్టాల్సిఉ ఉన్నా సిబ్బంది సరిగి చేయటం లేదు. దీనిపై జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసినా స్పందన కన్పించడం లేదు. దోమల ఉద్ధృతి వల్ల మలేరియా, డెంగీ జ్వరాలతో ఆసుపత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. కేవలం గాంధీ ఆసుపత్రిలో డెంగీతో ఇప్పటి వరకు దాదాపు 300 మంది చేరారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మరో 500 మంది మలేరియాతో బాధపడుతున్నారు.ఇవి కేవలం ప్రభుత్వ లెక్కలే. ఇక నర్సింగ్ హోంలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునే వారి సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే బాధితులు అధికంగానే ఉంటారు. దోమల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టక పోవడమే ఇందుకు కారణం. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఖాళీ స్థలాలు నిర్వహణను యజమానులు పట్టించుకోవడం లేదు. ఇందులో వర్షం నీరు చేరి చెత్తాచెదారం పేరుకుపోయి దోమలకు ఆవాసాలుగా మారతున్నాయి.ఇక తాగి పడేసిన కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ సీసాలు, కప్పులు కూడా దోమల వృద్ధికి పరోక్షంగా తోడ్పడుతున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించి పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం చూపుతోంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా దోమల నియంత్రణకు ఎవరికి వారు చర్యలు తీసుకోవాలి. దోమలు పెరగకుండా ఇంటి చుట్టూ పరిశుభ్రత పాటించాలి. ఎక్కడ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఖాళీ ప్రదేశాల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి.ఇంట్లో కూడా చెత్త లేకుండా చూసుకోవాలి. చీకటి మూలల్లో తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. ఏదైనా ప్రాంతంలో డెంగీ, మలేరియా జ్వరాలు ఉంటే తక్షణం జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలి. ఇంట్లో ఎవరికైనా మలేరియా, డెంగీ వస్తే మిగతా వారు అప్రమత్తంగా ఉండి, జ్వరం వస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. అధికారులు దోమల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.