చింతమనేనికి మరో షాక్
ఏలూరు,
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. శనివారం ఏలూరు జైలు నుంచి విడుదలైన ఆయనపై మరో కేసు నమోదయ్యింది. నిబంధనలను ఉల్లంఘించి, పోలీసు విధులకు ఆటంకం కల్పించారనే అభియోగాలతో ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభాకర్‌తో పాటూ మరికొందరు అనుచరులపైనా కేసు ఫైలయ్యింది.శనివారం ఏలూరు జైలు నుంచి విడుదలైన చింతమనేని ప్రభాకర్.. జైలు నుంచి ర్యాలీగా దుగ్గిరాలలోని తన ఇంటికి చేరుకున్నారు. కానీ పశ్చిమగోదారవి జిల్లాలో పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉందని.. త్రీ టౌన్ సీఐ ఎంఆర్‌ఎల్ ఎస్‌ఎస్ మూర్తి తన సిబ్బందితో శనివారపు పేటలో గస్తీ నిర్వహిస్తుండగా.. చింతమనేని ప్రభాకర్ ర్యాలీగా వస్తూ ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కల్పించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు చింతమనేని ర్యాలీ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. పోలీసు మోటారు వాహన చట్టాన్ని కూడా ఉల్లంఘించారనే అభియోగాలతో ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు ఫైల్ చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మరి ఈ కేసుపై ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.చింతమనేని ప్రభాకర్ దాదాపు రెండు నెలలకుపైగా ఏలూరు జైలులో ఉన్నారు. ఆయనపై ఏకంగా 18 కేసులు నమోదయ్యాయి. దళితులను దూషించిన కేసులో అరెస్టైన చింతమనేనికి కోర్టు గతంలోనే బెయిల్ మంజూరు చేసింది. తర్వాత ఆయనపై ఉన్న పాతకేసులు ఒక్కొక్కటిగా విచారణకు రావడంతో మరికొన్ని కేసుల్లో కోర్టు రిమాండ్ విధించింది. ఒక కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో రిమాండ్‌తో చింతమనేని విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. శుక్రవారం చింతమనేని బెయిల్ పిటిషన్‌పై విచారించిన ఏలూరు జిల్లా కోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.