పారదర్శకంగా విధులు నిర్వహించాలి
- జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి
జిల్లాలో విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారులు,సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గోని ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి 36 వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పారిశుద్ద్య నిర్వహణ మెరుగుపరిచే దిశగా చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ పకడ్భందిగా నిర్వహించాలని, గ్రామాల్లో పట్టణాలో ప్రత్యేక అధికారులు, సిబ్బంది ద్వారా నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవడం, సీజనల్ వ్యాధులు ముఖ్యంగా డెంగ్యూ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణీ కార్యక్రమం అనంతరం మహిళా ఆర్థికాభివృద్ది, మహిళ నేతృత్వంలో విశిష్ట కృషి చేసిన ఫలితంగా సిఎంఒ పీషియా వారు తెలంగాణ బెస్ట్ బ్రాండ్స్ అవార్డను పెద్దపల్లి జిల్లాకలెక్టర్ కు అందించిన నేపథ్యంలో జిల్లా అధికారులు, సిబ్బంది కలెక్టర్ కు తమ అభినందనలు తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ శాఖల వారిగా జిల్లాలో ఉన్న పనుల పురొగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఏసిబి దాడులలో తరచుగా ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ పట్టుబడుతున్నారని, ఇది చాలా విచారకరమని కలెక్టర్ అన్నారు. ప్రజలకు సేవలందించడానికి మనమంతా విధులలో చేరామని, కొందరు స్వార్థంతో అవినీతికి పాల్పడుతున్నారని, జిల్లా అధికారులు అవినీతికి దూరంగా ఉండాలని అదే విధంగా వారి కార్యాలయాలో సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, అవినితి రహితంగా విధులు నిర్వహించాలని అన్నారు.
ప్రజావాణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు అందించిన దరఖాస్తులలో కొన్ని ఈ దిగువున పేర్కోననైనది.
రామగుండం మండలం ఉదయ్ నగర్ కు చెందిన పుసాల మానస భర్తః రమేష్ తనకు ఇద్దరు కుమార్తలు ఉన్నారని, పదవ తరగతి వరకు చదువుకున్నానని, తమ ఆర్థిక పరిస్థతి సరిగ్గాలేనందున తన యందు దయతలచి తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరగా వారథి సోసైటీకి వ్రాస్తు అర్హత మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
సుల్తానాబాద్ మండలం సాంబయ్యపల్లి గ్రామానికి చెందిన కూకట్ల మల్లయ్య తఃకత్తరయ్య తాను సుల్తానాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలో జూన్1,2004 సంవత్సరం నుండి పార్ట్ టైం స్వీపర్ గా పనిచేయుచున్నాని, తనను పుల్ టైం స్వీపర్ గా నియమించుకోవాలని కోరగా జిల్లా విద్యాశాఖ అధికారికి వ్రాస్తు అవసరమైన మేర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన వి.శ్యామల సర్వే నెం.924 లోని 1 ఎకరం భూమి కొనుగోళు చేసి రిజిస్ట్రేషన్ చేసానని, ఆ భూమి యొక్క వివరాలను పట్టాదార్ పాస్ పుస్తకం అందించాల్సిందిగా కోరగా పెద్దపల్లి తహసిల్దార్ కు వ్రాస్తు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ఆదేశించారు.
రామగుండం మండలం జనగాం గ్రామానికి చెందిన జనగామ రాజమ్మ సర్వే నెం.427,410,412 లో ఉన్న 2 ఎకరాల 20 గుంటల భూమి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసి పట్టదార్ పాస్ పుస్తకం అందించాల్సిందిగా కోరగా రామగుండం తహసిల్దార్ కు వ్రాస్తు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన బి.సత్యనారాయణ తః రాయమల్లు సఖీ ప్రాజేక్టు నోటిఫికేషన్ లోని సంబంధిత ఉద్యోగాలు కనీస పని అనుభవం మరియు నిర్ణీత పని అనుభవం, అర్హతలు లేని వారికని నోటీఫికేషన్ ఉద్యోగాలు నియామకాలు చేసారని ఫిర్యాదు చేయగా జిల్లా సంక్షేమ అధికారికి వ్రాస్తు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓదెల మండల గ్రామానికి చెందిన గ్రామస్థులు తాము ఓదెల గ్రామ పంచాయతి అనుమతితో గృహలు నిర్మించుకున్నామని, రైల్వే అధికారులు తమ భూమి సేకరించుటకు నోటిఫికేషన్ విడుదల చేసారని, తమకు పునరావాస కల్పించాలని కోరగా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారికి వ్రాస్తు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి, జిల్లా ఇంచార్జి డిఆర్వో కె.నరసింహమూర్తి, జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది, తదితరులు ప్రజావాణీలో పాల్గోన్నారు.
================