ఉక్కిరి బిక్కిరవుతున్న జేసీ
అనంతపురం,
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన వ్యాపారసంస్థలపై దాడులు తీవ్రం కావడంతో బెంబేలెత్తిపోతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. అయితే జేసీ దివాకర్ రెడ్డి తరచూ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పైన వ్యక్తిగత విమర్శలు చేసేవారు. చంద్రబాబు మెప్పు పొందేందుకు జేసీ దివాకర్ రెడ్డి జగన్ ను దుర్భాషలాడుతుంటారని, వ్యక్తిగతంగా కూడా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారన్నది వాస్తవం.ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల సమయంలో జేసీ దివాకర్ రెడ్డి తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. తన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డికి ఎంపీ సీటును ఇప్పించుకున్నారు. సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి టీడీపీ టిక్కెడ్ దక్కింది. అయితే ఇద్దరు వారసులూ ఓటమి పాలవ్వడం, జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే జగన్ ను చెప్పలేని భాషలో దూషించిన సంగతి తెలిసిందే.జేసీ సోదరులు తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ లెక్క చేయలేదు. ఇటు సొంత పార్టీ నేతలతో కూడా జేసీ సోదరులకు పడేది కాదు. అనంతపురం జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యే జేసీకి ఫేవర్ గా అప్పట్లో ఉండేవారు కారు. జేసీ తలబిరుసుతనమే ఇందుకు కారణమని అప్పట్లో టీడీపీలోనే చర్చించుకునేవారు. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత జేసీ ట్రావెల్స్ బస్సును సీజ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్నారని దాదాపు 30 బస్సులను సీజ్ చేశారు. దీంతో జేసీ ట్రావెల్స్ దాదాపుగా మూతబడి పోయినట్లయింది. ఉన్న బస్సులన్నీ దాదాపు ఆర్టీఏ అధికారులు సీజ్ చేసినట్లయింది.అయినా పార్టీ నుంచి జేసీ దివాకర్ రెడ్డికి ఎవరూ మద్దతు పలకడం లేదు. కనీసం జిల్లా టీడీపీ నేతలు కూడా ఆయనను కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదు. జేసీ దివాకరరెడ్డిని ఆర్థికంగా దెబ్బతీస్తున్న జగన్ సర్కార్ ను ప్రశ్నించడానికి టీడీపీ నేతలు ముందుకు రాకపోయినా, ఆయనను కలసి ధైర్యాన్ని నింపే ప్రయత్నమూ చేయడం లేదు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం టీడీపీలో ఒంటరి అయిపోయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెబుతున్న జేసీ దివాకర్ రెడ్డి మాత్రం పార్టీ సమావేశాలకు హాజరవుతుండటం విశేషం