నట్టింట్లో ఉల్లి లొల్లి...
కర్నూలు,
ఎడతెరిపిలేని వర్షాలు, వరదల ప్రభావం, పంట దిగుబడి గణనీయంగా తగ్గడం.. వెరసి ఉల్లిధరలు గణనీయంగా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో కిలో రూ.60–70 వరకు ఉండటంతో వినియోగ దారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి తక్కువ ధరకే ఉల్లిని అందించే ఏర్పాట్లు చేయడం వల్ల కాస్త వెసులుబాటు లభించినా, రాష్ట్రంలో ఉల్లి ధరల ఘాటు మాత్రం తగ్గలేదు. రాష్ట్రంలో 95 శాతం ఉల్లి పంట ఒక్క కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. తక్కిన 5 శాతం మాత్రమే ఇతర జిల్లాల్లో పండుతోంది. కర్నూలు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏటా 87,500 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఎకరాకు సగటున 60 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఏటా 5.25 లక్షల టన్నుల ఉల్లి కర్నూలు జిల్లా నుంచి ఉత్పత్తి అవుతోంది. అయితే ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్ వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 40–45 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. పండిన గడ్డల్లోనూ ఎక్కువ శాతం కుళ్లిపోయాయి. మహారాష్ట్ర మార్కెట్ ఆధారంగా ఏపీలో ఉల్లి ధరలు నిర్ణయిస్తారు. అక్కడ ధరలు పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. ఇక్కడి, అక్కడి వ్యాపారుల మధ్య సంబంధాలు బాగా ఉండటంతో మార్కెట్ ధరలు కూడా దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ ఏడాది జూన్‌లో క్వింటా ధర కనిష్టంగా రూ.310 ఉంటే.. గరిష్టంగా రూ.1,520 వరకూ ఉండింది. సెప్టెంబర్ నుంచి ధరలు పెరిగాయి. సెప్టెంబర్‌లో గరిష్టంగా రూ.4,500, అక్టోబర్‌లో రూ.4070కు చేరింది. ఈ నెలలో 11వ తేదీన ఏకంగా రూ.5 వేలకు చేరింది. క్వింటా రూ.4,650 వరకూ విక్రయించారు. దీంతో రిటైల్ మార్కెట్‌లో మొదటి రకం ఉల్లి కిలో రూ.60–70 చొప్పున విక్రయిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉత్పత్తయ్యే పంటలో 20 శాతం మాత్రమే కర్నూలు మార్కెట్ యార్డులో అమ్మకాలు సాగుతాయి. మిగతా పంటను పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, హైదరాబాద్, చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. దాదాపు 50 శాతం ఇక్కడి పంటను తాడేపల్లిగూడెం వ్యాపారులే కొనుగోలు చేసి.. ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుండడం గమనార్హం.మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి ఎక్కువగా సాగవుతోంది. ఉత్తరభారత దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 48 వేల హెక్టార్లలో పంట సాగు చేస్తారు. ఈ ఒక్క జిల్లాలోనే 6.5 –7 లక్షల టన్నుల ఉల్లి పండుతుంది. ఈ ఏడాది వరదల ప్రభావంతో పంట బాగా దెబ్బతింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దేశ వ్యాప్తంగా వరదల దెబ్బకు ఒక్కసారిగా పంట దిగుబడి తగ్గడం, ఎగుమతులు కొనసాగడంతో కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయి. ఉల్లిరేట్లు పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడకుండా కిలో రూ.25కే విక్రయించేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఫెడరేషన్) ద్వారా నాసిక్ నుంచి 350 టన్నుల ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేసి.. రాష్ట్రంలోని మార్కెట్ యార్డులు, రైతు బజార్లలో కిలో రూ.25కే విక్రయిస్తోంది. మరో 300 టన్నుల కొనుగోలుకు కూడా ప్రతిపాదనలు పంపింది. మరోవైపు గోదాముల్లో అక్రమంగా నిల్వ చేసిన ఉల్లిపై విజిలెన్స్ దాడులు చేయించి, మార్కెట్‌లోకి తెస్తోంది. దీనికితోడు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈజిప్టు, నెదర్లాండ్స్ నుంచి లక్ష టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలోనూ కిలో రూ.25 చొప్పున ఉల్లిపాయలు అందుబాటులో ఉంటాయని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు.