వైసీపీలో ఐక్యతా రాగాలు
గుం టూరు, నవంబర్ 19
వారిద్దరూ కలిసి పోయారు. నీకోసం.. నేను, నా కోసం నువ్వు.. అంటూ ఐక్యతా రాగాలు పాడుకున్నారు. అయితే, అలాంటి నాయకులే ఇప్పుడు ఒకరిపై ఒకరు ఉవ్వెత్తున లేస్తున్నారు. ఒకరంటే.. ఒకరికి పడడం లేదు. కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఆధిపత్య రాజకీయాల కోసం కొట్టుకుంటున్న పనిచేస్తున్నారు. దీంతో ఇప్పుడు రాజధాని జిల్లా గుంటూరులో వైసీపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. ఇప్పటికే జిల్లాలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్య రాజుకున్న వివాదం సర్దుమణగక ముందే.. మరో వివాదం తెరమీదికి రావడం ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళ్తే.. ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వైసీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఉన్నపళంగా వైసీపీ అధినేత జగన్ మార్చారు. మరికొన్ని చోట్ల వ్యూహాత్మకంగా మారుస్తూ పోయారు. ఇలా మారిన వారిలో రావి వెంకటరమణ ఒకరు. ఈయన గుంటూరులోని కీలకమైన నియోజకవర్గం పొన్నూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేయాల్సి ఉంది. అయితే, ఎన్నికలకు 22 రోజుల ముందు అనూహ్యంగా ఆయనను పక్కకు పెట్టారు. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాల్సిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్యను ఇక్కడకు పంపారు. ఇద్దరి మధ్య సయోధ్య చేయడంతో కలిసి ఎన్నికల్లో ప్రచారం కూడా చేసుకున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగానే నడిచింది. రావి వెంకటరమణ.. గతంలో ప్రత్తిపాడు నుంచి విజయం సాధించారు.అదే సమయంలో 2014లో పొన్నూరు నుంచి పోటీ చేసి టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మీద ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన పట్టుబట్టి పొన్నూరులో ఈ ఏడాది ఎన్నికల్లో విజయం సాధించాలని నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ కోసం బాగానే కష్టపడ్డారు. కానీ, జగన్ నిర్ణయానికి ఆయన కట్టుబడ్డారు. ఈ క్రమంలోనే ఆయనకు కార్పొరేషన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర లేదు. ఇదిలావుంటే, ఇటీవల రావి బర్త్‌డే జరిగింది. ఈ సందర్భంగా ఆయన అనుచరులు, అభిమానులు.. పార్టీ నేతలు ఫ్లెక్సీలు.. ఏర్పాటు చేశారు. అయితే, పెదకాకాని, పొన్నూరు టౌన్, మండలాల్లోని పలు సెంటర్లలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను స్థానిక అధికారులు రాత్రికి రాత్రి తెంచేశారు.దీనిపై రావి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, స్థానికంగా వాటికి అనుమతి లేదని అధికారులు చెప్పడంతో ఎమ్మెల్యే రోశయ్యే ఉద్దేశపూర్వకంగా ఇది చేయించారని రావి వర్గం భావిస్తోంది. దీంతో రావి అనుచరులు కాకాని, పొన్నూరు మునిసిపల్ కార్యాలయయంతో పాటు జంక్షన్ల వద్ద నిరసన, ధర్నాలు కూడా చేపట్టారు. ఈ పరిణామాలు రాజకీయంగా వైసీపీలో కలకలం రేపాయి. ఇప్పటి వరకు బాగానే ఉన్న కిలారు-రావి వర్గాల మధ్య ఈ పరిణామం విభేదాలకు కారణమైందని అంటున్నారు. నియోజకవర్గంలో రావికి సీటు రాకపోయినా పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి పని చేయడంతో ఆయనకంటూ బలమైన వర్గం ఉంది. ఈ క్రమంలోనే ఈ వర్గాన్ని అణగదొక్కేందుకే రోశయ్య ఇలా చేస్తున్నట్టు రావి వర్గం ఆరోపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.