ఎపి సియం కప్ పోటీలకు ఏర్పాట్లు
ఏలూరు, నవంబర్ 19,
ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీవరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఎపి సియం కప్ 2019 నిర్వహణకు సంబంధిత శాఖలు ప్రణాళిక రూపొందించి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు ఆదేశించారు.
సోమవారం రాత్రి కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి సుమారు 364 మంది క్రీడాకారులు, 26 మంది కోచ్ లు మేనేజర్లు , 16 మంది టెక్నికల్ ఆఫీసర్లు రానున్నారని వారందరికీ ఎటువంటి అసౌకర్యంలేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎపి సియం కప్ 2019 క్రీడా పోటీలు సందర్భంగా పశ్చిమగోదావరిజిల్లా కు కేటాయించిన త్రోబాల్పై పోటీలు అల్లూరి సీతారామరాజు ఇండోర్ స్టేడియంలో జరుగనున్నాయని చెప్పారు. క్రీడాకారులకు స్టేడియంలోనే బ్రేక్ ఫాస్ట్, లంచ్ , స్నాక్ ఏర్పాటుచేసేందుకు స్టేడియంలో 4 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. క్రీడాకారులను రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ల నుండి వారికి ఏర్పాటుచేసిన వసతిగృహాలకు చేర్చేందుకు తగినన్ని బస్ లను ఏర్పాటు చేయాలన్నారు. మహిళా క్రీడాకారులకు ఆదివారపుపేటలోని ఉర్దూ స్కూల్ లోను, పురుషులకు స్టేడియం దగ్గరలోని ఎఆర్ డిజికె మున్సిపల్ హైస్కూలో వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కోచ్లు, టెక్నికల్ అధికారులకు స్దానికంగా వున్న లాడ్దిలలో వసతి ఏర్పాటు చేయాలన్నారు. క్రీడలు జరిగినన్ని రోజులు క్రీడా మైధానంలో ప్రాధమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్రీడలు జరిగే ప్రాంతంలో శానిటేషన్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటుచేసి అన్ని వేళలా పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో సెట్వెల్ సిఇఒ ప్రభాకరరావు, డియంఅండ్హెచ్ఒ డా.సుబ్రహ్మణ్యశ్వరి, మున్సిపల్ కమీషనర్ డి చంద్రశేఖర్ , గృహనిర్మాణశాఖ పిడి ఎన్సిఆర్ రెడ్ది, డిఎస్పి (ఎఆర్) విఎంకె రాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.