నియంతలా కేసీఆర్
హైదరాబాద్ నవంబర్ 19,
రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభంపై గవర్నర్ కు, రాష్ట్రపతికి ఫిర్యాదు విన్నవిస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన, సీఎం కేసీఆర్కు అహంకారం తలకెక్కి నియంతలా మారాడని ఆరోపించారు. దేశంలో ఏ సీఎం కేసీఆర్ లా ప్రవర్తించడం లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ కోర్టును కూడా గౌరవించరని తేలిందన్నారు. సమ్మె కార్మికుల చట్ట పరమైన హక్కు అని అన్నారు. కేసీఆర్ వైఖరితోనే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందన్నారు. రాజ్యంగ సంక్షోభం గురించి పరిశీలించాలని గవర్నర్, రాష్ట్రపతిని కోరే పరిస్థితి వస్తుందన్నారు. విపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే వాస్తవాలు బయటపెట్టాలని భట్టి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీఎంయూనే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తోందా? అని ఆయన ప్రశ్నించారు.