టీచర్ పై కారంపొడితో దాడి చేసిన మరో టీచర్
మెదక్ నవంబర్ 19
విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి.. వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన టీచర్లే దారి తప్పుతున్నారు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ కొందరు, రౌడీల్లా ప్రవర్తిస్తూ మరికొందరు, ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ టీచర్‌పై తోటి ఉపాధ్యాయుడు దాడికి పాల్పడ్డాడు. కళ్లలో కారంకొట్టి స్కూల్ లో నానా రచ్చ చేశాడు. దాంతో మిగతా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది.
స్కూళ్లో శ్రీనివాస మూర్తి ఫిజిక్స్ టీచర్‌గా, దేవరుషి మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇక దేవయ్య హెడ్మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల దేవయ్య లీవ్ లో ఉండడంతో దేవరుషి తాత్కాలికంగా ఇంచార్జి హెడ్మాస్టర్ గా పనిచేశారు. డీఈవో ఆదేశాల మేరకు ఫిజిక్స్ మార్కులను ఆన్ లైన్ చేయాలని మూర్తికి సూచించారు దేవరుషి. ఆ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన శ్రీనివాసమూర్తి.. దేవరుషిపై దాడికి పాల్పడ్డాడు.స్కూల్ ప్రారంభమయ్యాక రిజిస్టర్‌ల కోసం ఉపాధ్యాయులంతా ఆఫీస్ రూమ్‌కి వెళ్లారు. ఐతే దేవరుషిపై పగపెంచుకున్న శ్రీనివాస్ మూర్తి, తన వెంట తెచ్చుకున్న కారం పొడి ప్యాకెట్లను బయటకు తీసి కళ్లల్లో చల్లాడు. మిగతా టీచర్లు అప్రమత్తమై దేవరుషిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లి చికిత్స అందించారు. బాధిత టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఫిజిక్స్ టీచర్ శ్రీనివాస మూర్తిపై తోటి ఉపాధ్యాయులతో పాటు టీచర్లు విమర్శలు గుప్పించారు. ఆయన స్కూల్ కి ఇష్టానుసారం వస్తాడని, క్లాస్‌లు కూడా సరిగా చెప్పడని ఆరోపిస్తున్నారు. ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.