ఇంగ్లీష్ కు మతానికి లింకు పెడుతున్నారు
అనంతపురం
రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అనంతపురంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చారిత్రక అవసరంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారని పేర్కొన్నారు. ఇంగ్లీషు మీడియం చదువులకు.. మత మార్పిడులకు లింకు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని అమరావతి పనుల్లో సింగపూర్ ప్రభుత్వంతో పరస్పర అంగీకారంతో కాంట్రాక్టు రద్దు చేసుకున్నట్లు వివరించారు. ఏపీ అభివృద్ధి కి విపక్షాలు అడ్డుపడటం సరికాదని బొత్స సత్యనారాయణ విమర్శించారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి.. టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన ఓ చరిత్ర అని ప్రస్తుతించారు. అనంతపురం జిల్లాలో మరో మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించామని పేర్కొన్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక అందుబాటులోకి వచ్చిందన్నారు. మ్యుచువల్ కన్సెంట్ తోనే సింగపూర్ రాజధాని ఒప్పందం విరమించుకున్నామన్నారు. ఈ విరమణ వల్ల పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది లేదని, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని చెప్పారని పేర్కొన్నారు.