పాలు కాదు.. నీరుగారుతోంది (పశ్చిమగోదావరి)
ఏలూరు, నవంబర్ 19 : జిల్లాలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గోదావరి మిల్క్ గ్రిడ్ ప్రాజెక్టుల లక్ష్యం నీరుగారుతోంది. పాడి రైతుల కష్టానికి ప్రతిఫలం అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో జిల్లా వ్యాప్తంగా మిల్క్ గ్రిడ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇవన్నీ మూతపడ్డాయి. రూ.కోట్ల ప్రజాధనం వృథా అయింది. నిర్వహణ లోపంతోనే పాల శీతలీకరణ కేంద్రాలు మూతపడ్డాయని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో డీఆర్‌డీఏ, పశు సంవర్ధక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి మిల్క్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించారు. రూ.16 కోట్ల వ్యయంతో 28 పాలశీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం రూ.58 లక్షలు కేటాయించింది. ఈ మొత్తంతో భవన నిర్మాణంతోపాటు పాలశీతలీకరణకు ట్యాంకు, జనరేటర్, సామగ్రి, వెన్న శాతం కొలిచే పరికరాలను కొనుగోలు చేశారు. జిల్లాలో పాడి పరిశ్రమను ప్రోత్సహించడంతోపాటు రైతులు తీసుకొచ్చే పాలకు కనీస మద్దతు ధర అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.జిల్లావ్యాప్తంగా 2011లో ఈ కేంద్రాలను ప్రారంభించారు. వెలుగు మండల సమాఖ్యలకు వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. పాల శీతలీకరణ కేంద్రాలు ప్రారంభించిన తరువాత వీటి నిర్వహణకు ఒక్కో కేంద్రాన్ని రూ.5 లక్షల చొప్పున.. మొత్తం రూ.1.40 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.లోపాలు ఇవే: ఒక్కో పాల శీతలీకరణ కేంద్రంలో 2 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పాలు నిల్వ చేసే ట్యాంకులను ఏర్పాటు చేశారు. పాల సేకరణ అనుకున్న లక్ష్యాలను చేరుకోకపోవడంతో నిర్వహణ భారం పెరిగింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వీటిని ఏర్పాటు చేసినా కాల క్రమంలో అధికారులు ప్రైవేటు డెయిరీల కంటే ఇక్కడ పాలకు తక్కువ ధర చెల్లించే వారు. దీంతో 2013 నాటికే వీటిలో దాదాపు 50 శాతం కేంద్రాలు మూతపడ్డాయి. మిగిలినవి కొంతకాలం నిర్వహించారు. నష్టాలతో మూతపడిన పాల శీతలీకరణ కేంద్రాలను డీఆర్‌డీఏ అధికారులు ప్రాంతాల వారీగా ప్రైవేటు వ్యక్తులు, డెయిరీలతోపాటు పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంఘాలకు అప్పగించారు. కొన్ని చోట్ల ప్రైవేటు డెయిరీలకు డీఆర్‌డీఏ అప్పగించినా ఇంతవరకు వాటిని సంబంధిత సిబ్బంది స్వాధీనం చేసుకోలేదు. శీతలీకరణ కేంద్రాలకు పాలసేకరణకు మండలానికి 20 నుంచి 22 మంది పాల మిత్రలను నియమించారు. అద్దె వాహనాల్లో వీరు రోజూ గ్రామాలకు వెళ్లి పాలు సేకరించేవారు. ఇందుకోసం వారికి కమీషన్ ఇచ్చేవారు. జిల్లాలో చాలామందికి ప్రభుత్వం కమీషన్ చెల్లించలేదు. పాలుపోసిన రైతులకు కూడా చాలామందికి సొమ్ము చెల్లించలేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన ప్రాజెక్టు అధికారుల అలసత్వంతో నిరుపయోగంగా మిగిలింది.