టీడీపీ లో ఉంటే పవిత్రుడినా...
విశాఖపట్టణం, నవంబర్ 19,
టీడీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలపై స్పందించారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. అయ్యప్ప దీక్షలో చెప్పులు వేసుకోవడంపై సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందన్న మంత్రి.. చెప్పులు వేసుకోవడానికి కారణాలను చెప్పుకొచ్చారు. కొన్ని అనారోగ్య కారణాలతోనే తాను చెప్పులు వేసుకుంటున్నట్లు చెప్పారు. టీడీపీ ఎంపీగా ఉన్న సమయంలోనూ అయ్యప్ప దీక్ష వేసుకొని చెప్పులతో నడిచినట్లు గుర్తు చేశారు. టీడీపీ నేత మురళీమోహన్ కూడా మాలలో చెప్పులు వేసుకుంటారని చెప్పుకొచ్చారు. తాను చెప్పులు వేసుకునే విషయం టీడీపీలో ఉన్నప్పుడే తెలుసని.. అయినా చంద్రబాబు మతాన్ని రాజకీయానికి అడ్డు పెట్టుకొని తనను టార్గెట్ చేశారని మండిపడ్డారు. టీడీపీలో ఉన్నపుడు మాలలో పవిత్రంగా ఉన్న తాను.. వైఎస్సార్‌సీపీలో చేరగానే అపవిత్రుడ్ని అయ్యానా అంటూ ప్రశ్నించారు. తాను హిందూ మతాన్ని ప్రేమించే వాడినని.. హిందూ మతంలోనే పుట్టాను.. హిందూ మతంలోనే చనిపోతాను అన్నారు మంత్రి.రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై చంద్రబాబు, టీడీపీ నేతలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అవంతి. చంద్రబాబు కుమారుడు లోకేష్, మనవడు దేవాన్ష్ ఇంగ్లీషు మీడియంలో చదువుకోవచ్చు.. పేద పిల్లలు ఇంగ్లీషులో చదవకూడదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు పద్దతి మార్చుకోవాలన్నారు. ఇంగ్లీష్ మీడియంను రాష్ట్రవ్యాప్తంగా అందరూ స్వాగతిస్తుంటే.. టీడీపీ మాత్రం వ్యతిరేకిస్తోందన్నారు