రోగులకు వైద్యం చేయాల్సిన ఓ వైద్యుడు దారి తప్పాడు. తన వద్దకు వచ్చిన నలుగురు మహిళా రోగులను లైంగికంగా వేధించిన వైద్యుడికి కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జస్వంత్ రాథోడ్ అనే భారత సంతతి వైద్యుడు బ్రిటన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని డుడ్లీలో కేస్టర్ మీడోస్ సర్జరీ అనే ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 2008 నుంచి 2015 మధ్య కాలంలో తన వద్దకు చికిత్సకు వచ్చిన నలుగురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన వోల్వెర్‌హాంప్టన్ క్రౌన్ కోర్టు జస్వంత్‌ను దోషిగా తేల్చింది. 12 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మైఖెల్ చలినర్ మాట్లాడుతూ తన వద్దకు వచ్చిన రోగులను లైంగికంగా వేధించి వ్యక్తిగత జీవితాన్ని సంతృప్తి పరచడానికి ఉపయోగించుకోవడం నేరమని పేర్కొంటూ జైలు శిక్ష విధించారు.