వివాదమౌతున్న లంచం తీసుకోను ఫ్లెక్సీ
కరీంనగర్, నవంబర్ 20,
అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్వో విజయారెడ్డి హత్య జరిగిన తరువాత కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగడంలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఎదైనా పనిజరగాలంటే అధికారుల చేయి తడపాల్సిందేనంటూ ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ కరీంనగర్ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు అందుకు భిన్నంగా వ్యహరిస్తున్నారు.పని జరగాలంటే లంచం ఇవ్వాల్సిన పనిలేదంటూ ఏడీఈగా పనిచేస్తున్న పోడేటి అశోక్ తన ఆఫీస్ గదిలో నేను లంచం తీసుకోని అని బోర్డ్ ఏర్పాటు చేయడం నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్వతహాగా నిజాయితీ పరుడైన అశోక్ ఈ బోర్డ్ ను 40 రోజుల క్రితమే పెట్టినట్లు తెలుస్తోంది. సామాన్యులు ఎవరైనా తన కార్యాలయంలో లంచం తీసుకుంటున్నట్లు తెలిస్తే వెంటనే మీడియాకు చెప్పండి అని అశోక్ చెబుతున్నారు.ఈ బోర్డ్ ఏర్పాటు చేయడంపై పలువురు ప్రభుత్వ ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను లంచం తీసుకోనని బోర్డ్ పెట్టడంతో ఒకరో, ఇద్దరో అభినందనలు తెలిపారని, పలువురు తనని వేధిస్తున్నారని వాపోతున్నారు. నువ్వొక్కడివే నీతి మంతుడివా..? మిగిలిన వారు అవినీతి పరులా అంటూ బెదిరిస్తున్నారని అన్నారు.అంతేకాదు ఇప్పటి వరకు ఎంత తిన్నావు. ఇప్పుడు లంచం తీసుకోనని బోర్డ్ పెడుతున్నావని ఎగతాళి చేస్తున్నట్లు తెలిపారు. అందుకే తాను ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించినట్లు చెప్పారు. అశోక్ పై వస్తున్న విమర్శలపై సహచర ఉద్యోగులు స్పందిస్తున్నారు. అవినీతిని అంతం చేసేందుకు అశోక్ కృషి చేస్తున్నారని, అయనకు మద్దతు తెలపాలని కోరుతున్నారు.