తమిళ నాట కొత్త పొలిటికల్ స్క్రీన్
చెన్నై, నవంబర్ 20
తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. దిగ్గజ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై మక్కల్ నీధి మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ ముందుగా సంకేతాలిచ్చారు. రజనీ, తను 44 ఏళ్లుగా స్నేహితులం అన్న కమల్.. అవసరమైతే.. మెరుగైన తమిళనాడు కోసం తామిద్దరం చేతులు కలుపుతామన్నారు.ఈ విషయమై రజనీకాంత్ కూడా సానుకూలంగా స్పందించారు. కమల్‌తో చేతులు కలపడానికి తాను కూడా సిద్ధమనే సంకేతాలిచ్చారు. పరిస్థితులు డిమాండ్ చేస్తే.. నేను కమల్‌తో చేతులు కలుపుతానని సూపర్ స్టార్ తెలిపారు. రాజకీయాల్లో అద్భుతాలు, వింతలు జరుగుతాయని వ్యాఖ్యానించిన కమల్.. రెండ్రోజుల తర్వాత రజనీ, తాను కలిసి సాగుతామనేలా వ్యాఖ్యానించారు.కమల్ హాసన్. విలక్షణ నటుడు. నిత్య విద్యార్థి. కె. బాలచందర్, కె.విశ్వనాథ్, భారతీరాజా, మణిరత్నం వంటి దిగ్గజ దర్శకులతో పాటు… నేటి తరం దర్శకుల వరకు ఎవరి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికైనా వెనుకాడరు. ఆ గొప్ప లక్షణమే భారతీయ చిత్ర సీమలో ఆయననో విలక్షణ నటుడిగా నిలబెట్టింది. చలన చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టి… మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించిన కమల్ హాసన్ కొన్ని బాలారిష్టాలు ఎదుర్కొంటున్నారు.పార్టీ ప్రారంభించిన కొన్ని రోజు ల్లోనే ఇతర పార్టీల నుంచి ఎదురు దాడి ఎదుర్కొంటున్నారు. రాజకీయాలు నడపడమంటే సినిమాల్లో నటించడం అంత తేలిక కాదని ఆయనకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. అందుకేనమో రాజకీయాల్లోను తనకో గురువు ఉంటే బాగుండునని అనుకున్నారు. బిజూ జనతాదళ్ అధ్యక్షుడిగా, ఒడిశ్శాకి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా, మిస్టర్ క్లీన్‌గా పేరుగాంచిన నవీన్ పట్నాయక్‌ని ఆయన తన రాజకీయ గురువుగా ఎంచుకున్నారు.ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు కమల్ హాసన్ సోమవారం ఒడిశా వెళ్లారు. నేరుగా సీఎం నివాసానికి వెళ్ళి నవీన్ పట్నాయక్‌ని కలిశారు. రాష్ట్రానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన కమల్ హాసన్ కి నవీన్ సాదరంగా స్వాగతం పలికారు. 30 నిమిషాలు జరిగిన ఈ భేటీలో వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడైన నవీన్ నుంచి తాను చాలా సలహాలు తీసుకున్నానని, తాను అడిగిన ప్రశ్నలకు ఆయన గొప్పగా సమాధానాలు చెప్పారని ఆ భేటీ అనంతరం కమల్ హాసన్ పేర్కొన్నారు. బీజేడీతో మీ పార్టీ ఏదైనా రాజకీయ అవగాహన కుదుర్చుకుంటుందా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు… దాన్ని పార్టీ సీనియర్లు నిర్ణయిస్తారని కమల్ హాసన్ బదులిచ్చారు.నవీన్ పట్నాయక్ రాజకీయాలు చేసే విధానాన్ని తాను చాలా శ్రద్ధగా పరిశీలిస్తుంటానని, ఆయన సలహాలు తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఆయనను కలవడం చాలా సంతోషంగా ఉందని కమల్ హాసన్ తెలిపారు. కమల్ హాసన్ తో భేటీ తనకూ ఎంతో సంతోషాన్ని కలిగించిందని, కమల్ రాజకీయ జీవితం, అవకాశాలు, ఆయన చేస్తున్న సినిమాల గురించి చాలా చర్చించామని నవీన్ తెలిపారు. కమల్ ఒడిశా లోని కోణార్క్, చిల్కా సరస్సు వంటి ప్రఖ్యాత ప్రదేశాలన్నీ తిరిగి చూడాలని నవీన్ ఆకాంక్షించారు