నేతల మాటల తూటాలు
హద్దులు దాటుతున్న బూతులు
విజయవాడ, నవంబర్ 20,
రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నడూలేని రీతిలో అధికార, ప్రతిపక్ష నేతలు కత్తులు దూసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆరు నెలలు తిరక్క ముందే ఏపీ రాజకీయం తిరిగి ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. ఇప్పటి వరకు పార్టీలకే పరిమితమైన ఆరోపణలు వ్యక్తిగత దూషణలతో తార స్థాయికి చేరాయి. అంతేకాదు అప్రజాస్వామిక పదజాలంతో నేతలు రోడ్డున పడుతున్నారు. చివరకు కుటుంబ సభ్యులను, చనిపోయిన వారిని కూడా బజారుకీడ్చే రీతిలో నేతలు దూషించుకోవటంతో రాజకీయ సెగలు రగులుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య గత కొద్ది రోజులుగా మాటల తూటాలు పేలుతున్నాయి. లుచ్చాలు..బచ్చాలు..ఒరే.. నా...! చెప్పు తెగుద్ది.. బూట్లు నాకరా..!! ఈ విధంగా వాడటానికి పనికిరాని భాషలో నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వామపక్ష పార్టీలు మినహా అధికార.. ప్రతిపక్ష పార్టీలు దేనికీ ఇందులో ఎలాంటి మినహాయింపులేదు.గతంలో ఆంధ్ర ప్రాంత నేతలను తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ తిట్టిన తిట్లకు మించి రెండింతలుగా ఏపీ నేతలు పోటీ పడుతున్నారు. వ్యక్తిగత దూషణలతో పాటు కుటుంబ సభ్యులు, చనిపోయిన వారిని సైతం బజారుకీడ్చే పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఎన్నికల ముందు కనిపించే వ్యక్తిగత విమర్శలు కూడా ఈ రకంగా ఉండవు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలకు దిశానిర్దేశం చేసి రాష్ట్ర విభజన అంశాలను సాధించుకోవాల్సిన నేతలు పరస్పర నిందారోపణలతో కాలం వెళ్లదీస్తున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేయటం సహజం. అందుకు దీటుగా ప్రజోపయోగ కార్యక్రమాలను చేపట్టి ప్రతిపక్ష ఆరోపణలకు చెక్ పెట్టాల్సిన అధికార పార్టీ తామేమీ తక్కువ కాదనే రీతిలో తార స్థాయిలో దూషణలకు దిగటంతో రాజకీయాలంటేనే ఏవగింపు కలిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.. ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్విట్టర్ వార్‌కే పరిమితమైన దూషణలు గత రెండు రోజులుగా ఇరు పార్టీల నేతలు ప్రయోగిస్తున్న పదజాలంతో పతాక స్థాయికి చేరింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ, టీడీపీ మధ్య జరిగిన విమర్శలు, పరస్పర ఆరోపణల నేపథ్యంలో సభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు.. ఉచ్ఛరించాల్సిన భాషపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్వయాన శాసనసభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. సభను హుందాగా నిర్వహిస్తామని కూడా వెల్లడించారు. ఇదంతా సమావేశాలకే పరిమితం కాగా ఇప్పుడు నేతలు రోడ్డున పడ్డారనేది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఇసుక కొరతను, ఆంగ్ల బోధనను వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చేపట్టిన లాంగ్‌మార్చ్‌లో ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ప్రతిగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చివరకు ముఖ్యమంత్రి జగన్‌తో కూడా స్పందించటం విశేషం. ఆంగ్ల మాధ్యమంపై చేసిన విమర్శలకు సీఎం జగన్ పవన్‌ను ఉద్దేశించి ఆయనకు ముగ్గురు భార్యలు.. నలుగురో..ఐదుగురో సంతానం ఉన్నారు.. వారు ఎక్కడ చదువుతున్నారో చెప్పమనండని వ్యాఖ్యానించారు. మంత్రులు కూడా పవన్‌పై సెటైర్లు వేశారు. దీనిపై స్పందించిన ఆయన తెలుగుభాషను విస్మరిస్తే మట్టికొట్టుకు పోతారని శాపనార్థ్థాలు పెట్టారు.. అంత వరకు బాగానే ఉంది. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా ఆయనపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఘాటుగా స్పందించటంతో పాటు పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో సహా ఇతర ముఖ్య నేతలందరినీ టార్గెట్ చేస్తూ తార స్థాయిలో వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు వంశీ ప్రకటించిన వెను వెంటనే ఆ పార్టీ నేతలు వంశీకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయే అని ఇంకా పలు రకాల విమర్శలు చేశారు. అంతేకాదు ఎలక్ట్రానిక్ ఛానళ్ల లైవ్ ప్రసారాల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై ఎమ్మెల్యే వంశీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇది పూర్తి స్థాయిలో ప్రసారం కావటంతో సోషల్ మీడియాలోకెక్కి రచ్చరచ్చ అయింది.ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఏ1, ఏ2 ముద్దాయిలని సీఎం జగన్, విజయసాయిరెడిని ఉటంకించటంతో పాటు విమర్శలలో ఓ అడుగు ముందుకేశారు. వైవీబీపై వంశీ విమర్శల నేపథ్యంలో వైసీపీని లక్ష్యంగా చేసుకుని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, లోకేష్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నానిని ఉద్దేశిస్తూ దేవినేని ఉమా సన్న బియ్యం సరఫరా చేస్తానని చెప్పిన సన్నాసి అని వ్యాఖ్యానించారు. దీంతో రెచ్చిపోయిన నాని సన్నబియ్యం ఇస్తానని నీ అమ్మ మొగుడికి చెప్పానా.. అని ప్రశ్నించారు. అంతేకాదు చంద్రబాబు ఓ లుచ్చా అని సంబోధించారు. తిరుమల వెళితే ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సంతకం చేసి వెళ్తుందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె ఇటలీ వనిత.. జగన్ ఏపీ పౌరుడు.. చిదంబరం, సోనియా బూట్లు నాకింది మీరు కాదా అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అంతేకాదు నీ అమ్మ మొగుడు కట్టించాడా తిరుపతిని అని మండిపడటంతో పాటు వైఎస్ రాజారెడ్డి దోపిడీలు చేశారని బాబు చేసిన ఆరోపణపై స్పందిస్తూ నీ అయ్య ఖర్జూరనాయుడు తిరుపతి బస్టాండ్‌లో జేబులు కొట్టాడా అని తీవ్ర స్థాయిలో ప్రత్యారోపణలు చేశారు. నీ తాత.. ఆడి తాత ఏంచేశారో బహిర్గతం చేస్తాననని జాతకాలు తేల్చుకుందామని సవాల్ విసరడం గమనార్హం. దీన్ని బట్టి వచ్చేనెల 2వ తేదీ నుంచి జరిగే శాసనసభ సమావేశాలు ఏ రకంగా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారిం