టెలికాం కంపెనీల బాదుడు షురూ
ముంబై, నవంబర్ 30
టెలికం కంపెనీల బాదుడు షురూ అయ్యింది. ఇన్నాళ్లు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ వచ్చిన టెల్కోలు ఇప్పుడు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి కస్టమర్లకు ఝలక్ ఇస్తూ వస్తున్నాయి. నిమిషాల వ్యవధిలో టారిఫ్ ధరలు పెంచుతామని ప్రకటించి వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కంపెనీలు యూజర్ల నెత్తిన పెద్ద బాంబ్ వేశాయి. ఇప్పుడు వీటి సరసన చేరింది ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో కూడా.రిలయన్స్ జియో కూడా రానున్న రోజుల్లో టారిఫ్ ధరలు పెంచుతామని ప్రకటించింది. నెట్‌వర్క్ విస్తరణ, టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్లు ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఉచిత కాల్స్ అంశంపై మాటతప్పిన జియో ఇప్పుడు టారిఫ్ ధరలు పెంచుతామని ప్రకటించడం గమనార్హం. జీవితాంతం కస్టమర్లకు ఏ నెట్‌వర్క్‌కు అయినా ఫ్రీ కాల్స్ అందిస్తామని చెప్పిన జియో ఇటీవలనే కస్టమర్లకు షాకిచ్చింది. ఇతర నెట్‌వర్క్ కాల్స్‌కు చార్జీలు వసూలు చేస్తోంది.వచ్చే కొద్ది వారాల్లోనే మొబైల్ ఫోన్ కాల్స్, డేటా చార్జీలను పెంచనున్నామని ప్రకటించిన రిలయన్స్ జియో.. ఎంత మేర టారిఫ్ ధరలు పెరుగుతాయనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీ టారిఫ్ ధరలు పెంచుతామని ప్రకటించిన ఒక రోజు తర్వాతనే జియో కూడా ఈ ప్రకటన చేయడం గమనార్హం.ఇకపోతే సెప్టెంబర్ నెలలో జియోకి కొత్తగా 69.83 లక్షల యూజర్లు జతయ్యారు. దీంతో కంపెనీ మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 35.52 కోట్లకు చేరింది. అదేసమయంలో భారతీ ఎయిర్‌టెల్ 23.8 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. ఈ సంస్థ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 32.55 కోట్లుగా ఉంది. వోడాఫోన్ ఐడియా 25.7 లక్షలు యూజర్ల సంఖ్య తగ్గింది. ఈ కంపెనీకి మొత్తంగా 37.24 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.