చారిత్రాత్మక టెస్ట్ కు ఈడెన్ రెడీ
పింక్ బాల్ పై చర్చ
బెంగాల్, నవంబర్ 20
క్రికెట్ అభిమానులంతా డే నైట్ టెస్టు మ్యాచ్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ టెస్టులో ఆడబోతున్న క్రికెటర్లతో పాటు వ్యాఖ్యాతలు, మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ పింక్ బాల్ టెస్టుపై తెగ మాట్లాడుకుంటున్నారు. రెండు రోజుల ముందే అక్కడ క్రికెట్ సందడి మొదలైంది. చరిత్రాత్మక తొలి టెస్టు కోసం ఈడెన్ గార్డెన్స్ భారీ ఏర్పాట్లు చేసింది. కోల్‌కతాలోని ప్రధాన వీధులన్నీ గులాబీమయమయ్యాయి. భారత ఆటగాళ్లకు అభిమానుల పింక్ టీ షర్ట్‌ల ధరించి ఘన స్వాగతం పలికారు.స్టేడియంలో జరిగే చారిత్రక టెస్టును చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తనున్నారు. అభిమానుల నుంచి విశేష స్పందన రావడంతో ఐదు రోజుల మ్యాచ్‌లో మొదటి నాలుగు రోజుల టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబీ బంతితో జరిగే తొలి డే నైట్ టెస్టు మొదటి నాలుగు రోజుల టికెట్లు అమ్ముడుపోయాయని, తనకెంతో సంతోషంగా ఉందని దాదా అన్నారు. భారత్‌లో అతిపెద్దదైన క్రికెట్ మైదానం ఈడెన్ గార్డెన్స్ సామర్థ్యం 67వేలు. స్టేడియమంతా ఇప్పటికే గులాబీ రంగులతో మెరిసిపోతోంది. భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి నిర్వహించనున్న డే అండ్ నైట్ టెస్టుకు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) గులాబీ టెస్టువేడుకను అంగరంగవైభవంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో పింకు-టింకు పేరిట మస్కట్‌ను ఆవిష్కరించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. మైదానంలో పింక్ బెలూన్‌ను ఎగురవేస్తే.. క్రికెట్ అభిమానులు కనిపించిన గోడనల్లా గులాబీ గ్రాఫిటీలతో ముంచేశారు. దీంతో కోల్‌కతా వీధులు గులాబీ రంగు పులుముకున్నాయి. నగరం మొత్తం గులాల్ చల్లినట్లు ఎటు చూసిన గులాబీ మయమైంది. క్యాబ్ కార్యాలయంపై భారత జట్టు సాధించిన మధుర విజయాల ఫొటో ఎగ్జిబిషన్ ప్రదర్శించగా.. నగరంలోని చారిత్రక భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు గులాబీ కాంతులీనుతున్నాయి. క్రీడా ఔత్సాహికులు ఒక అడుగు ముందుకు వేసి తమ భవనాలకు కూడా పింక్ కలర్ వేస్తుండటం.. డే అండ్ నైట్ టెస్టు క్రేజ్‌ను స్పష్టం చేస్తున్నది.గులాబీ టెస్టు కోసం బంగ్లాదేశ్ కూడా కసరత్తులు ముమ్మరం చేసింది. ఇండోర్ టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండు రోజులు ఫుల్ ప్రాక్టీస్ చేసింది. ఇందులో భాగంగా ఈడెన్‌లో తేమ ఎక్కువగా ఉండే చాన్స్ ఉండటంతో తడిబంతులతో ప్రత్యేక సాధనలో మునిగిపోయింది. కోచ్ డొమింగ్ ఆధ్వర్యంలో క్యాచ్‌లు ప్రాక్టీస్ చేసిన బంగ్లా ప్లేయర్లు.. ఆ తర్వాత బంతిని నీళ్లలో ముంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. పింక్ బంతి పిచ్‌ను తాకిన వెంటనే వేగంగా కదులుతున్నది. బ్యాట్‌పైకి త్వరగా దూసుకొస్తున్నది. అలాగే కొత్త బాల్ ఎక్కువ స్వింగ్ అవుతున్నది అని బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ అన్నాడు.డే అండ్ నైట్ టెస్టులో ఆఫ్‌స్పిన్నర్లతో పోల్చుకుంటే.. మణికట్టు స్పిన్నర్లు ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలున్నాయని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. దులీప్ ట్రోఫీ అనుభవంతో తానీ మాటలు అంటున్నానని పేర్కొన్నాడు. మణికట్టు స్పిన్నర్లకు పింక్ బంతితో అదనపు ప్రయోజనాలు దక్కుతాయి. సూర్యాస్తమయం సమయంలో మాత్రం స్పిన్నర్ల కంటే పేసర్లే ఎక్కువ ప్రభావం చూపగలరు. ఒకవేళ టీమ్‌ఇండియా భవిష్యత్తులో మరిన్ని డే అండ్ నైట్ టెస్టులు ఆడాలనుకుంటే.. ఇప్పటి నుంచే మణికట్టు స్పిన్నర్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దులీప్ ట్రోఫీని గమనిస్తే.. అక్కడ కుల్దీప్‌ను అర్థం చేసుకోవడంలో బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. బంతి కాస్త మెత్తగా ఉండటంతో ఫింగర్ స్పిన్నర్లకు దానిపై పట్టు చిక్కడం కష్టమే.. జారిపోయే ప్రమాదం ఉంది. గులాబీ బంతిపై మరింత అవగాహన రావాలంటే.. దేశవాళీల్లో మరిన్ని డే అండ్ నైట్ మ్యాచ్‌లు నిర్వహించాలి. అప్పుడే ప్రతి ఒక్క ఆటగాడికీ పింక్ బంతిపై స్పష్టమైన అంచనా ఏర్పడుతుంది అని భజ్జీ అన్నాడు.