చలితో చచ్చే చావు (ఖమ్మం)
ఖమ్మం, నవంబర్ 20పేద విద్యార్థినులకు మెరుగైన విద్యనందించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహిస్తున్నవే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. ఏటేటా ప్రవేశాల్లో ఆదరణ పెరుగుతున్న ఈ విద్యాలయాల్లో మౌలిక వసతులు కొరవడి విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారు. చలికాలంలో చన్నీటి స్నానాల వెతలను తీర్చేందుకని 2016-17లో సోలార్ వాటర్ హీటర్లను కేజీబీవీల్లో ఏర్పాటు చేశారు. చలి, వర్షాకాలంలో విద్యార్థులు వేడినీటితో స్నానాలు చేయడానికి సౌకర్యంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. హీటర్లు పనిచేసేందుకు ఏర్పాటు చేసిన సౌర ఫలకలు, సంబంధించిన పరికరాలు ఉభయ జిల్లాల్లోని కొన్ని విద్యాలయాల్లో ఆది నుంచీ పని చేయడంలేదు. మరికొన్ని చోట్ల కొన్నాళ్లకు మరమ్మతులకు గురయ్యాయి. ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమై ఆరు నెలలు కావస్తోంది. ప్రస్తుతం చలి తీవ్రమైంది. వాటర్ హీటర్లు పనిచేయకపోవడంతో బాలికలు చన్నీళ్లతో స్నానం చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు కమ్మేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యాలయాల్లో వేలాది మంది విద్యార్థినులు చన్నీటి స్నానాలు ఆచరించి అనారోగ్యాల బారిన పడుతున్నారు.కస్తూర్బా విద్యాలయాల్లో సౌర వాటర్ హీటర్లకు ట్యాంకుల నుంచి కనెక్షన్లు ఇవ్వకపోవడం, ఇతర కారణాలు వల్ల వేడి నీటిని విద్యార్థులకు అందించలేకపోతున్నారు. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లో ఏ పాఠశాలలోనూ ఈ పరికరాలు పనిచేయడం లేదు. విద్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేసిన ఆనతికాలంలోనే మూలకు చేరాయి. మరమ్మతులు చేసే వీల్లేకపోవడం, గుత్తేదారులు పట్టించుకోకపోవడంతో అన్నింటినీ పక్కన పడేశారు. నిరుపయోగంగా ఉన్న వాటిని పునరుద్ధరణ చేయించేందుకు ప్రత్యేకాధికారులు దృష్టి సారించాలి. ఒప్పందం ప్రకారం ఏడాది మరమ్మతుల బాధ్యతలు చూడని గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలి. విద్యాలయాల ప్రత్యేకాధికారులు కొందరు ఉన్నతాధికారులకు సమాచారం అందించినా పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది.ఒక్కో హీటరుకు రూ.2.25 లక్షలు వెచ్చించారు. మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వీటి కోసం వెచ్చించిన నిధులు రూ.31.50 లక్షలు. ఖమ్మం జిల్లాలోని కేజీబీవీలకూ ఇంతే మొత్తంలో ఖర్చు చేశారు. ఓ ప్రైవేటు గుత్తేదారుడికి వీటి ఏర్పాటుతోపాటు ఏడాది నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. సోలార్ హీటర్లను బిగించాక ఆ తర్వాత జాడ లేకపోవడంతో దాదాపు 28 విద్యాలయాల్లోనూ ఆయా పరికరాలు పనిచేయని వైనం నెలకొంది. పాల్వంచ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు 333 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. శీతాకాలంలో వారి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటర్ పనిచేయడం లేదు. ఫలితంగా చలిలోనే చన్నీటి స్నానాలు చేస్తున్నారు. కొందరు జలుబు, దగ్గు, జ్వరం బారినపడుతున్నారు. ఇక్కడ హీటర్ కోసం ఏర్పాటు చేసిన సౌర ఫలకలు ఆది నుంచీ పనిచేయడం లేదు.