బెంగాల్ లోకి ఓవైసీ... టెన్షన్ లో దీదీ
బెంగాల్, నవంబర్ 20,
మజ్లిస్.. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన ఈ పార్టీ ఇప్పుడు మెల్లగా దేశమంతటా విస్తరిస్తోంది. గత కొంత కాలంగా అసదుద్దీన్ ఓవైసీ దూకుడుగా ముందుకెళ్తున్నారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పార్టీ పోటీకి దిగుతోంది. మహారాష్ట్ర, బిహార్ అసెంబ్లీల్లోనూ ఈ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోనూ ఉనికి చాటింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు సీట్లు గెలిచిన ఎంఐఎం.. పరోక్షంగా బీజేపీ-శివసేన కూటమి విజయానికి సహకరించింది. మహా ఎన్నికల సంగ్రామం తర్వాత.. అసదుద్దీన్ ఇప్పుడు బెంగాల్‌పై ఫోకస్ పెట్టారు.ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం బరిలో దిగడం వల్ల.. ముస్లింల ఓట్లు కాంగ్రెస్, మజ్లిస్ మధ్య చీలిపోయాయి. పరోక్షంగా ఇది బీజేపీ శివసేన కూటమికి ప్రయోజనం చేకూర్చింది. మహారాష్ట్ర ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రెండు సీట్లను గెలుపొందడంతోపాటు.. మొత్తంగా 7.37 లక్షల ఓట్లను సాధించింది. బీఎస్పీ, ఎస్పీ సాధించిన సీట్ల కంటే ఇది అధికం.బెంగాల్‌లో మజ్లిస్ పోటీ చేయనుందనే వార్తలతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. దేశంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రెండో రాష్ట్రం బెంగాల్. పశ్చిమ బెంగాల్ ఓటర్లలో 27 శాతం ముస్లింలే. వీరంతా ఇప్పటి వరకు మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీకి మద్దతు ఇస్తున్నారు. వామపక్షాలకు కంచుకోట లాంటి బెంగాల్‌లో 2011లో దీదీ జెండా ఎగరేయడానికి ప్రధాన కారణం ముస్లింలు టీఎంసీకి అండగా నిలవడమే.బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. దాదాపు 90 స్థానాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువ. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీఎంసీ దాదాపుగా అన్ని స్థానాలనూ టీఎంసీ గెలుపొందింది. 2021లో ఎన్నికల్లోనూ.. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న స్థానాల్లో తేలిగ్గా గెలవొచ్చనే ధీమాలో దీదీ ఇప్పటి వరకూ ఉన్నారు.కానీ బెంగాల్లో పార్టీని విస్తరించడంపై అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నాలు ప్రారంభించారు. పక్కనే ఉన్న బిహార్‌లోని కిషన్‌గంజ్ సీటును గెలిచిన తర్వాత ఓవైసీ తన ఫోకస్‌ను బెంగాల్ వైపు మళ్లించారు. ఇప్పటి వరకూ ఆయన బెంగాల్‌లో పార్టీ విభాగాన్ని ప్రారంభించలేదు. కానీ కోల్‌కతా, దినాజ్‌పూర్, మాల్డా, ముషీరాబాద్, జల్పాయ్‌గురి, నదియా జిల్లాల్లోని యువతతో ఓవైసీ టచ్‌లో ఉన్నారు. వీరంతా మజ్లిస్ భావజాలాన్ని వ్యాపింపజేసే పనిలో ఉన్నారు.ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. బెంగాల్‌లో బీజేపీ హిందూ కార్డ్ ప్లే చేయగా.. టీఎంసీ ముస్లిం ఓటర్లను నమ్ముకుంది. ఫలితంగా బీజేపీ బెంగాల్‌లో 18 లోక్ సభ స్థానాలను గెలుపొందింది.హిందూ ఓట్లన్నీ బీజేపీకి మళ్లుతున్న వేళ.. దీదీ ముస్లిం ఓట్లమీదే ఆశలు పెట్టుకున్నారు. కానీ 2021లో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మజ్లిస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. టీఎంసీ, మజ్లిస్ మధ్య ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోతే.. పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే బీజేపీ దూకుడుతో కలవరానికి గురవుతున్న తృణమూల్ శ్రేణులను.. మజ్లిస్ రూపంలో మరో ముప్పు భయపెడుతోంది.మజ్లిస్ రూపంలో దూసుకొస్తున్న ముప్పును ఊహించిన మమతా బెనర్జీ.. తీవ్రవాదంటూ ఓవైసీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. హిందూ ఓటర్లు 80 శాతానికిపైగా ఉన్న కుచ్ బిహార్‌లో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముస్లింలు ఓవైసీని నమ్మకుండా చూడటంతోపాటు.. హిందూ ఓటు బ్యాంకును తనవైపు మళ్లించుకోవాలనేది కూడా దీదీ వ్యూహంగా కనిపిస్తోంది. ఓవైసీ కూడా మమతను టార్గెట్ చేసుకొని విమర్శలకు దిగుతున్నారు.2014 లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 39 శాతం ఓట్లతో 34 సీట్లను గెలుపొందింది. 2019లో 22 సీట్లను మాత్రమే గెలిచింది. కానీ ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 3.5 శాతం పెరగడం గమనార్హం. బీజేపీ భయంతో ముస్లింలు టీఎంసీకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడమే దీనికి కారణం.మరోవైపు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 17 శాతం ఓట్లు సాధించగా.. 2019 లోక్ సభ ఎన్నికల నాటికి అది 40 శాతానికి చేరింది. మతాల వారీగా ఓట్లు చీలిపోయాయి అనడానికి పెరిగిన బీజేపీ ఓటు బ్యాంకే నిదర్శనం. బీజేపీ కారణంగా.. తనకు దూరమైన హిందూ ఓటు బ్యాంకును తిరిగి తనవైపు తిప్పుకోవడం, ముస్లింలు మజ్లిస్ వైపు మళ్లకుండా చూడటం దీదీ లక్ష్యంగా కనిపిస్తోంది.ముస్లింలలో కొద్ది శాతం మంది ఎంఐఎం వైపు మళ్లినా.. అది బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందనడంలో ఎలాంటి సందేహం. లేదు. అందుకే టీఎంసీ నేతలు అసదుద్దీన్ ఓవైసీని.. బీజేపీ ఏజెంట్ అంటూ ఆరోపిస్తున్నారు. ఓవైసీ మతం పేరిట ఓట్లు రాబట్టేందుకు వస్తారని.. అది ముస్లింలకు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు