YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

సమ్మె...కొనసాగించాలా...వద్దా

సమ్మె...కొనసాగించాలా...వద్దా

 సమ్మె...కొనసాగించాలా...వద్దా
డోలాయమానంలో ఆర్టీసీ జేఏసీ
హైద్రాబాద్, నవంబర్ 20, 
ఆర్టీసీ సమ్మె కొనసాగించాలా? వద్దా? అనే దానిపై కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. సమ్మె కొనసాగింపుపై మంగళవారం ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర తర్జనభర్జనలకు లోనైన సంగతి తెలిసిందే. సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్‌ కోర్టుకు నివేదించడంతో.. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ బుధవారం కూడా సమావేశమైంది. సమ్మె విషయమై లేబర్‌ కమిషన్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సమావేశంలో నేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. మరోవైపు కొనసాగింపు కార్మికుల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది.  47 రోజులుగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా సమ్మె కొనసాగించడం సమంజసం కాదని, ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయని కొందరు కార్మికులు చెప్తుండగా.. ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం నుంచి హామీ తీసుకున్నాకే సమ్మె విరమించాలని, అర్ధంతరంగా సమ్మె విరమిస్తే.. ఇన్నాళ్లు చేసిన పోరాటానికి ఫలితమూ, ప్రయోజనమూ ఉండదని మరికొందరు కార్మికులు అభిప్రాయపడుతున్నారు.. సమ్మె కొనసాగింపుపై కార్మికుల అభిప్రాయం తీసుకున్నామని, ఆర్టీసీ జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికుల హామీ ఇచ్చారని ఈ భేటీ అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తమకు అందలేదని, కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి.. సమ్మె కొనసాగింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైకోర్టు బుధవారం తుది తీర్పు ప్రకటించే అవకాశముందని, ఆ తరువాత సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. జేఏసీ తుది నిర్ణయం తీసుకునేవరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు.46 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం వాదన ఏమిటి, కార్మికుల తరఫున ఏ వాదన వినిపించారు, కోర్టులు ఏం చెప్పాయి అన్నది చర్చించారు. అయితే, సమ్మె విరమణ విషయంలో కార్మికుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేవని, ఇంకా సమ్మె కొనసాగిస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయని, లేబర్ కోర్టులో ఈ అంశం తేలడానికి చాలా సమయం పడుతుందని కొంతమంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది ఎన్ని రోజులైనా ప్రభుత్వం దిగొచ్చేవరకు సమ్మె కొనసాగించాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. ఉన్నపళంగా సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత ఏమిటని కార్మికులు నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. సమ్మెను విరమిస్తే ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదా అన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కనీసం లేబర్‌ కోర్టులో తేలేవరకైనా సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఈయూ సమావేశంలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. బ్యాలెట్ పెట్టి కార్మికుల అభిప్రాయం తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ పొందిన తర్వాత సమ్మె విరమించాలని పలువురు కార్మికులు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. లేబర్ కమీషన్‌కు హైకోర్టు ఇచ్చిన 15 రోజుల సమయం వరకు వేచిచూద్దామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని కార్మికుల్లో కొంతమంది అభిప్రాయపడుతున్నారు

Related Posts