జగన్ పై నేషనల్ మీడియా ఎందుకింత గుర్రు
న్యూఢిల్లీ, నవంబర 21,
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా మీడియా పరంగా కూడా సంచలనం సృష్టించాయి. జగన్ పాలన రివర్స్‌లో వెళ్తోందని, రాజకీయ కక్ష సాధింపు చర్యగానే జగన్ పాలన ఉందంటూ.. జాతీయ మీడియా(ఇంగ్లీష్) కథనాలు వెలువరిస్తోందని, వ్యాసాలు, ఎడిటోరియల్స్ ను రాస్తోందని పేర్కొంటూ.. వీటికి సంబంధించి క్లిప్పింగులను పవన్ తాజాగా తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీంతో రాజకీయంగా ఈ వ్యాఖ్యలు, పోస్టులు కాక రేపుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో ఇలా జరుగుతోంది. అలా జరుగుతోందని అంటూ.. పవన్ చేసిన వ్యాఖ్యలు ఒక కోణంగా భావించి.. ఇవి రాజకీయ విమర్శల్లో భాగమని అందరూ అనుకున్నారు.అయితే,… ఇప్పుడు ఏకంగా జాతీయ మీడియా అలా అంటోంది. ఇలా అంటోంది.. అంటూ.. కేంద్రంలోనూ జగన్‌ను బూచిగా చూపించేందుకు ప్రయత్నించడం మరింత సంచలనానికి కారణంగా మారుతోంది. రెండు దశాబ్దాలకు ముందు జాతీయ మీడియా ఒక విధంగా ఉంటే.. ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణలు, నాయకుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ మీడియా కూడా ముందుకు సాగుతోంది. తనకు అనుకూలంగా ఉండే వారైతే.. ఒక రకంగా.. లేక పోతే.. మరోరకంగా మీడియా కథనాలు రాస్తోందంటూ.. కీలక నేతలే అనేక వేదికలపై ప్రస్తావించారు.కెనడాలో అయినా కాకరకాయ చేదుగానే ఉంటుందనే సామెత మాదిరిగా.. జాతీయ మీడియా అయినా.. లోకల్ మీడియా అయినా ఒక్కటే! ఎవరి ప్రాధాన్యాలు వారివే. కేంద్రంలో యూపీఏ ఉన్నన్నాళ్లు.. బొగ్గు కుంభకోణంపై పెద్దగా పట్టించుకోని జాతీయ మీడియా యూపీఏ దిగిపోయిన తర్వాత అదే అంశంపై పుంఖాను పుంఖాను లుగా వార్తలు రాసిన విషయం మరిచిపోలేదు. రఫేల్ కుంబకోణం .. అంటూ.. వెలువరించిన కథనాల్లోనూ మోదీని బూచిగా చూపించాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. సో.. ఎలా చూసినా.. ప్రాంతీయ మీడియా అయినా జాతీయ మీడియా అయినా స్వలాభమే ప్రధానం.ఇక, రాష్ట్రం విషయానికి వస్తే.. స్థానిక నేత పవన్.. జాతీయ మీడియాను వెంటేసుకుని విమర్శించడం కొత్తగా అనిపించినా.. ఈ పరిణామం.. మనకు జగన్ పాలన ప్రారంభమైన వెంటనే మొదలైంది. టీడీపీ కూడా జాతీయ మీడియాలో జగన్ గురించి ఇలా రాశారు.. అలా రాశారు.. అంటూ.. వ్యాఖ్యలు చేసింది. దీనికి వైసీపీ వాదన ఎలా ఉన్నా.. టీడీపీ నేతల వాదన ప్రకారం.. లోకల్ మీడియా అయితే.. కత్తి కట్టిందని, అందుకే వ్యతిరేక వార్తలు రాసిందని అనుకున్నా.. జాతీయ మీడియాకు ఆ అవసరం లేదుకదా ? అనే వాదన తెరమీదికి తెచ్చారు.నిజమే స్థానికంగా జాతీయ మీడియాకు ప్రతిఫలాపేక్ష లేకపోయినా.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న సుజనాచౌదరి సహా బీజేపీలోని కీలక నేతల ప్రమేయం ఉందన్న చర్చలు ఏపీ రాజకీయాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. పైగా వ్యూహాత్మకంగా వరుస కథనాలు ప్రచురించి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే ప్రయోగం చేయడం.. గడిచిన నెల రోజులుగా జాతీయ మీడియాలో కనిపిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ అమరావతి సహా పోలవరం నిధుల దుర్వినియోగం, పట్టిసీమ వృధా అంటూ.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ వంటివి ప్రధానంగా చర్చించాయి. అప్పట్లో వీటిపై మౌనం వహించారు. కానీ, ఇప్పుడు జగన్‌ను టార్గెట్ చేయాల్సి వచ్చే సరికి మాత్రం ఇలా విరుచుకుపడుతున్నారనే వాదన ప్రబలంగా ప్రజల్లోకి వెళ్లింది. ఎవరు ఏమన్నా.. తమ కిందకు నీళ్లు రానంత వరకు ప్రజలను వీరు నమ్మించలేరనేది వాస్తవం.