గులాబీ ఎమ్మెల్యేలకు షాక్
హైద్రాబాద్ నవంబర్ 21
టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇల్లు, కార్యాలయంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల నుంచి దఫాలు దఫాలుగా ఐటీ అధికారులు ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. వెంకటరావు నగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు క్షుణ్నంగా తనిఖీలు జరిపారు. మాధవరం కృష్ణారావుకు ముగ్గురు బినామీలు ఉన్నట్లు కూడా ఐటీ అధికారులు గుర్తించారు.ఈ ముగ్గురిలో ఒకరు ఒక ప్రముఖ పత్రికకు సంబంధించిన విలేకరి అని సమాచారం. మాధవరం కృష్ణారావు కుమారుడు వెంకట ప్రణీత్ డెవలపర్స్ అనే సంస్థ ఉంది. మాధవరం కృష్ణారావు కార్యాలయం ఇంటిపై ఐటీ దాడులు జరగడం.. అధికార పార్టీలో సంచనమైంది. ఈయన కంపెనీల్లో ‘పెద్దల’ పెట్టుబడులు కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐటీ దాడుల్లో ఈ అంశాలు బయటపడితే మరింత మందికి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది.వెంకట ప్రణీత్ డెవలపర్స్ ఎండీ, మరో ఐదుగురు డైరెక్టర్ల నివాసాల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది
టీఆర్ఎస్ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడని హోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది. వేమువాలవాడ నుంచి ఎమ్మెల్యే గెలిచిన చెన్నమనేని రమేష్‌కు ద్వంద్వ పౌరసత్వం ఉందని.. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ గతంలో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ విచారణ జరిపింది. మరో వైపు కేంద్ర హోం శాఖ తన పౌరసత్వం రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ స్పందించారు. ‘పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హోం శాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం’ అన్నారు.2017లో హోం శాఖ తన పౌరసత్వం రద్దుచేసిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. అనంతరం సుప్రీం కోర్టు విచారణలో భాగంగా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయన్నారు. ఈ ఏడాది జులై 15న తన పౌరసత్వం రద్దును అపెక్స్ కోర్టు కొట్టివేసిందన్నారు.పౌరసత్వ చట్టం, నిబంధనలు, నైతిక విలువలు, వ్యక్తి సామాజిక నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని సెక్షన్ 10.3ని చూడాలని... సాంకేతికంగా వేరుచేసి చూడరాదని హైకోర్టు తన తీర్పులో పేర్కొందని చెప్పారు. హోం శాఖ తన విచారణలో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించిందన్నారు.ఒకవేళ సెక్షన్ 10.3 ఉపేక్షించి ఏ నిర్ణయం వెలువడ్డా న్యాయం కోసం మళ్లీ తమ వద్దకు రావచ్చని హైకోర్టు పేర్కొన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉటంకించారు. హైకోర్టు ఆదేశాల మేరకే అక్టోబర్ 31న ఢిల్లీలో మరోసారి వాదనలు జరిగినప్పటికి.. హైకోర్టు ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. 'హైకోర్టును మళ్లీ ఆశ్రయిస్తా.. న్యాయం జరుగుతుందని విశ్వాసముంది' అని ఆయన చెప్పారు.టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఒకే రోజు.. అటు ఐటీ శాఖ, ఇటు హోం శాఖ దాడులు చేయడం తెలంగాణలో రాజకీయంగా చర్చనీయాంశమైంది.