శబరిమల కోసం కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ, నవంబర్ 21
శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు వెలువరించింది. అయ్యప్ప ఆలయ నిర్వహణపై ప్రత్యేక చట్టం చేయాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయాన్ని సందర్శించే భక్తుల సంక్షేమం సహా అన్ని అంశాలతో చట్టాన్ని రూపొందించి జనవరి మూడో వారంలోగా తమకు అందజేయాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. అయితే, శబరిమల విషయంలో గతేడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. శబరిమల రివ్యూ పిటిషన్లపై జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గతవారం విస్తృత ధర్మాసనం ధర్మాసనానికి బదిలీచేసిన విషయం తెలిసిందే.ఆలయాలు, వాటి నిర్వహణకు సంబంధించిన చట్టానికి సవరణలు ప్రతిపాదించామని, దాని ప్రకారం ఆలయ సలహా మండళ్లలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ముసాయిదాలో పొందుపరిచినట్టు కేరళ ప్రభుత్వం తరఫు లాయర్ చెప్పారు. ప్రస్తుతానికి 50 ఏళ్లు దాటిన మహిళలకు సలహా మండళ్లలో ప్రాతినిధ్యం కల్పించనున్నట్టు తెలిపారు.శబరిమల ఆలయానికి కొత్త చట్టాన్ని రూపొందించాలని ఆగస్టు 27న కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం కోరింది. అయితే, ట్రావెన్‌కోర్-కొచ్చిన్ హిందూ మత సంస్థల చట్టంలో ముసాయిదా సవరణలను కేరళ రూపొందించింది. ఇది సరిపోదని, శబరిమల ఆలయ పరిపాలన కోసం ప్రత్యేకమైన చట్టం అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పందళం రాజవంశం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అయ్యప్ప ఆలయం, సమీపంలోని మసీదు నిర్వహణపై తొలిసారిగా 2006లో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.