ఆధునిక డి.ఆర్.ఎఫ్ వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నవంబర్ 21
గ్రేటర్ హైదరాబాద్ లో విపత్తులు సంభవించినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఎనిమిది డి.ఆర్.ఎఫ్ వాహనాలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె టి రామారావు ప్రారంభించారు. జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్ మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ద్వారా సమకూర్చుకున్న ఈ ప్రత్యేక వాహనాలను నెక్లెస్ రోడ్‌లోని జిహెచ్ఎంసి పార్కింగ్ యార్డ్ లో మంత్రి కేటీఆర్, డిప్యూటీ \ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. విపత్తుల నివారణకై ప్రత్యేకంగా రూపొందించిన ఎనిమిది వాహనాల్లో ఒక్కొక్కదానిలో ఆరు ప్రత్యేక పరికరాలు కలిగిన బాక్సులు, జనరేటర్, ఆక్సిజన్ సిలిండర్లు తదితర పరికరాలు ఉన్నాయి. ప్రతి వాహనాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించి అత్యవసర సమయంలో ఏ పరికరాన్ని ఏవిధంగా ఉపయోగిస్తారని సిబ్బందిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి డిజాస్టర్ రెస్క్యూ వాహనంలో మెడికల్ కిట్,సేఫ్టీ హెల్మెట్ లు, కట్టర్లు, పంప్ సెట్, డిమాలిషన్ హమార్, స్లాబ్ కట్టర్, ఫైర్ బాల్స్ , ఫైర్ సూట్ , సేఫ్టీ నెట్ తో పాటు రక్షణ పరికరాలు ఉన్నాయి. వీటితోపాటు రోప్ లాడర్, ఎలక్ట్రిక్ కటర్లు తదితర 13 రకాల పరికరాలు ఉన్నాయి.
*500 మీటర్ల వరకు వ్యాపించే ప్రత్యేక ఆస్కా లైట్లు*
నేడు ప్రారంభించిన వాహనాలతో పాటు ప్రత్యేకంగా సమకూర్చుకున్న ఆస్కా లైట్ మంత్రి కేటీఆర్ ను ఆకట్టుకుంది. రాత్రివేళల్లో దాదాపు 20 అడుగుల ఎత్తుకు ఆటోమేటిక్ గా వెళ్లి వెలుతురు ను ఈ ఆస్కా లైట్ దాదాపు 500 మీటర్ల వరకు అందిస్తుంది. ఇటీవల గోదావరి నదిలో బోటు మునిగిన సందర్భంలో ఇదే మాదిరి ఆస్కా లైట్ ల సహాయంతో బోటు వెలికి తీసే కార్యక్రమాలను చేపట్టినట్టు విశ్వజిత్ వివరించారు. ఈ ఆధునిక పరికరాలు, వాహనాలను సమకూర్చుకోవడం ద్వారా జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్ మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం విపత్తుల నివారణ రంగంలో ప్రత్యేకంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నగరవాసుల్లో భద్రతకు సంబంధించి విశ్వాసాన్ని కల్పించడంలో డి ఆర్ ఎఫ్ సఫలీకృతమైందని మంత్రి అభినందించారు.