ఇమ్రాన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి:పాక్ మత గురువు
కరాచీ నవంబర్ 21
: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై అక్కడి మత గురువు, రాజకీయ నాయకుడు మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇమ్రాన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ ధ్వజమెత్తారు. దక్షిణ ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో్ మంగళవారం జరిగిన ఓ ధర్నాలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలంతా దొంగలేనని ఇమ్రాన్ వ్యాఖ్యానించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ సోదరికి జాతీయ సయోధ్య ఆర్డినెన్స్ (ఎన్ఆర్‌వో) కింద భారీ లబ్ధి చేకూర్చారంటూ దుయ్యబట్టారు.‘‘ఈ ప్రభుత్వం వేర్లు ఎప్పుడో తెగిపోయాయి. ఇక వాళ్లకు మిగిలింది కొద్దిరోజులు మాత్రమే.. ఇమ్రాన్ ఖాన్ తన సోదరికి ఎన్‌ఆరోవో ఇచ్చారు. అలాంటి కుట్టు యంత్రం మాకిస్తే సంవత్సరానికి 70 బిలియన్ల పాకిస్తానీ రూపాయలను సంపాదిస్తాం..’’ అని రెహ్మాన్ పేర్కొన్నారు. అవినీతి, అక్రమ లావాదేవీలు, హత్య నేరాలు సహా వివిధ కేసుల్లో చిక్కుకున్న రాజకీయ నేతలు, కార్యకర్తలు, బ్యూరోక్రాట్లకు క్షమాభిక్ష పెట్టేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం 2007లో ఎన్ఆర్‌వో పేరిట ఆర్డినెన్స్ తీసుకువచ్చింది.