ఎన్నార్సీని అమల్లోకి తెస్తే తీవ్ర పరిణామాలు: ప్రతిపక్షాల హెచ్చరిక
న్యూఢిల్లీ నవంబర్ 21
: దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్‌ఆర్సీ)ని అమలు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ పార్టీలు అమిత్ షా ప్రకటనను ఖండించాయి. ఎన్నార్సీని అమల్లోకి తెస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించాయి. ఎన్నార్సీని తమ రాష్ట్రలో అమలు చేసే ప్రసక్తే లేదంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే తెగేసి చెప్పారు.‘‘ఎన్నార్సీ అమలు పేరుతో రాష్ట్రంలో కొందరు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను అధికారంలో ఉన్నంత కాలం పశ్చిమ బెంగాల్లో ఎన్నార్సీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించను...’’ అని మమత స్పష్టం చేశారు. అసోంలో అమలు చేసిన ఎన్నార్సీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో చేసుకున్న అసోం ఒప్పందంలో భాగంగా జరిగిందని ఆమె గుర్తుచేశారు. దీన్ని దేశమంతటా అమలు చేయలేరని ఆమె పేర్కొన్నారు.మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నార్సీ ప్రకటనపై ఇదే తరహాలో స్పందించింది. ‘‘మతాల ఆధారంగా సమాజాన్ని ముక్కలు చేసేందుకు కేంద్రం, అధికార పార్టీలు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్నార్సీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చించాలి....’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. కాగా అసోం ఆర్ధిక మంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఎన్నార్సీ అమలును తీవ్రంగా వ్యతిరేకించారు. అసోంలో ప్రస్తుతం అమలు చేస్తున్న ఎన్నార్సీని రద్దు చేయాలనీ... ప్రజలందరికీ జాతీయ ఎన్నార్సీ ప్రక్రియలో చోటు కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.