కృష్ణా రివర్ బోర్డును అమరావతికి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు?
సీఎం జగన్ సమాధానం చెప్పాలి: సుజనాచౌదరి డిమాండ్
న్యూఢిల్లీ
: కృష్ణా రివర్ బోర్డును అమరావతికి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి డిమాండ్ చేశారు. కృష్ణా రివర్ బోర్డును అమరావతిలో పెడతామన్నా డబ్బుల్లేవని ఏపీ ప్రభుత్వం ఎందుకంటోంది? అని ప్రశ్నించారు. మా ఇష్టానుసారం ఉంటాం, మతాలవారీగా పంపకాలు చేసుకుంటూ పోతామని జగన్ 151 సీట్లు గెలవక ముందే చెప్పి ఉండాల్సింది.. అప్పుడు తెలిసేది ఏం జరిగేదోనని చెప్పారు. ఈ 6 నెలల్లో వ్యవస్థలను పాడు చేయడమే కనిపిస్తోందని ఎంపీ మండిపడ్డారు. పోలవరానికి రూ.1800 కోట్లు విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఆలోచనపరులు, రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులంతా తమ ఆలోచనలన్నింటిని ఏకం చేసి ఏపీని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఏపీలో బీజేపీతో కలవాలని వైసీపీతో సహా అన్ని పార్టీలు వెంపర్లాడుతున్నాయని తెలిపారు. తమకు ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు. ఏపీలో సొంతంగా ఎదగడం ఎలా అనే విషయంపై జేపీ నడ్డాతో చర్చించామన్నారు.